Supreme Court: బిహార్‌లో ఓటరు జాబితా సవరణపై ఈ నెల 10న సుప్రీం విచారణ
బిహార్‌లో ఓటరు జాబితా సవరణపై ఈ నెల 10న సుప్రీం విచారణ
Supreme Court : బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన పలు అభ్యర్థనలపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ నెల 10న విచారణ చేపట్టనున్నట్లు జస్టిస్ సుధాంశు దూలియా, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన పాక్షిక పనిదిన(పీడబ్ల్యూడీ) ధర్మాసనం (Supreme Court) వెల్లడించింది. పలువురు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం చేసిన అభ్యర్థనల్ని పరిగణనలోకి తీసుకుంటూ కోర్టు గురువారం విచారణ చేపడతామని ప్రకటించింది.
నవంబరులో బిహార్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంత స్వల్ప కాలంలో సమగ్ర ఓటరు జాబితా సవరణ పూర్తి చేయడం అసాధ్యమని కపిల్ సిబల్ కోర్టుకు తెలియజేశారు. రాష్ట్రంలో మొత్తం 8 కోట్ల మంది ఓటర్లుండగా జాబితా సవరణ కసరత్తులో భాగంగా నాలుగు కోట్ల మంది తమ గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ అన్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదికి ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిందిగా ధర్మాసనం పిటిషనర్లను కోరింది. ఎన్నికల అధికారులు ఆధార్ కార్డును కానీ, ఓటరు కార్డును కానీ గుర్తింపు పత్రంగా అంగీకరించడం లేదని మరో సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కోర్టు దృష్టికి తెచ్చారు.
Supreme Court – ఓటు హక్కు హరించే తుంటరి చేష్ట కాంగ్రెస్
బిహార్ లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకించే విషయంలో దేశ ప్రతిపక్ష పార్టీలన్నీ సమైక్యంగా ఉన్నాయని కాంగ్రెస్ వెల్లడించింది. సవరణను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆ పార్టీ ఎన్నికల సంఘం చర్యను ఓటు హక్కు హరించే తుంటరి విధానంగా అభివర్ణించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో న్యాయం చేస్తుందన్న పూర్తి నమ్మకం తమకుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ అన్నారు.
Also Read : CM Rekha Gupta: యోగి ఆదిత్యనాథ్ కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సంచలన లేఖ !
