Hemant Soren: హేమంత్‌ సోరెన్‌ పై సుప్రీం ఆగ్రహం !

హేమంత్‌ సోరెన్‌ పై సుప్రీం ఆగ్రహం !

Hemant Soren: భూ కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో ఝార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటీషన్ పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఆక్షేపించింది. ఈ కేసులో వాస్తవాలను దాచి బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారంటూ హేమంత్‌ సోరెన్‌(Hemant Soren) పై సుప్రీంకోర్టు మండిపడింది. దీనితో బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సోరెన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టుకు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం నిమిత్తం తనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని సోరెన్‌ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ విషయాన్ని ప్రస్తావించారు.

Hemant Soren Case Updates

దీనిపై విచారణ ప్రారంభించిన జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మతో కూడిన సెలవుకాలీన ధర్మాసనం… సోరెన్‌ పిటిషన్‌పై అసహనం వ్యక్తం చేసింది. ట్రయల్‌ కోర్టులో రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయడం… అది తిరస్కరణకు గురికావడం గురించి తమకు తెలపలేదని… కేసులో వాస్తవాలను దాచడానికి ప్రయత్నించారని ఆగ్రహించింది. ఒకేరకమైన ఉపశమనం కోసం రెండు న్యాయస్థానాలను ఆశ్రయించడాన్ని ప్రశ్నించింది. అనంతరం బెయిల్‌ అభ్యర్థనను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయటానికి ధర్మాసనం సిద్ధం కాగా… తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కపిల్‌ సిబల్‌ తెలిపారు. బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించేందుకు ధర్మాసం అనుమతించింది.

Also Read : Calcutta High Court: ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు !

Leave A Reply

Your Email Id will not be published!