TDP Comment : కాలం చిత్రమైంది. అంతకంటే విచిత్రమైంది. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా, మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకోకుండా ముందుకు వెళితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఇప్పుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు తెలిసి వచ్చింది. అభివృద్దికి నమూనాకు ప్రతిరూపమని, విజన్ అంటే తానేనని ఇప్పటి దాకా చెబుతూ వచ్చినా ఇంకా జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉండడం విస్తు పోయేలా చేసింది. అతిరథ మహారథులను అందించింది తెలుగుదేశం పార్టీ(TDP). భారత దేశ రాజకీయాలలో ఓ సునామీలా దూసుకు వచ్చింది. ఆ తర్వాత అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. కానీ రాను రాను మూస ధోరణిలోకి వెళ్లడంతో పార్టీలో సంస్థాగత పరంగా ఏం జరుగుతుందో బేరీజు వేసుకోలేని స్థితికి రావడం వల్లనే ఇదంతా చోటు చేసుకుందనే విమర్శలు లేక పోలేదు.
TDP Comment Viral
కొన్నేళ్లుగా సీఎంగా ఉన్నారు. దేశ రాజకీయాలలో చక్రం తిప్పారు. తనదైన రీతిలో ప్రభావం చూపిన దాఖలాలు అన్నీ ఉన్నా ఎందుకనో వైసీపీ చీఫ్ , ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డిని అంచనా వేయడంలో చంద్రబాబు అంచనాలు తప్పినట్లు ఉన్నాయి. వ్యక్తిగత దూషణల పర్వం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో మామూలై పోయాయి. ఏపీ స్కిల్ స్కామ్ ఒక్కటే కాదు పలు స్కాంలు చంద్రబాబు హయాంలోనే జరిగాయని సాక్షాత్తు సీఎం ప్రకటించారు. అంటే దీని అర్థం ఆయన జీవిత కాలం సెంట్రల్ జైలులోనే ఉంటారని అనిపిస్తోంది. రిమాండ్ ఖైదీ అన్న విషయం పక్కన పెడితే తమ మీద తమకు ఉన్న అతి నమ్మకం కొంప మునిగేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిత్యం వ్యూహాలు పన్నే చంద్రబాబు ఎందుకని ఊహించ లేక పోయాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తన భార్యను అమ్మనా బూతులు తిట్టారంటూ చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టినా ఎవరూ కనికరించ లేదు. కనీసం సానుభూతి కూడా తెలపలేదు.
ఇదే సమయంలో తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన సమయంలో రోడ్డు మార్గం ద్వారా తరలిస్తుండగా ఎక్కడా సానుభూతి రాలేదు. ఎవరూ బయటకు వచ్చి మద్దతుగా ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు, బస్సులు కాల్చడాలు , దిష్టి బొమ్మలు తగులబెట్టడాలు జరగలేదు. ఒకటి రెండు చోట్ల మాత్రమే కొనసాగాయి. ఇంకా పాత ప్రభావంలోనే ఉన్నారని అనిపిస్తోంది చంద్రబాబు నాయుడును చూస్తే. ఇదే సమయంలో తనకు వెన్ను దన్నుగా ఉంటూ వచ్చిన కులం, సామాజిక వర్గం, మీడియా ఇప్పుడు నెత్తీ నోరు బాదుకున్నాకనీసం బెయిల్ మీద కూడా తెచ్చేందుకు సాహసించడం లేదు. జగన్ ఎంతో పకడ్బందీగా ఇరికించాడనేది బహిరంగ రహస్యమే.
ఇక కేంద్రంలో మోదీ, అమిత్ షాకు తెలియకుండా బాబు అరెస్ట్ జరిగిందని అనుకోవడానికి వీలు లేదు. మరో వైపు తండ్రి కోసం పోరాటం చేయాల్సిన లోకేష్ బాబు ఢిల్లీలోనే చక్కర్లు కొట్టడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఏది ఏమైనా ప్రజల మధ్య ఉంటేనే నాయకులకు మద్దతు లభిస్తుంది. అంతే కాదు తమపై మోపిన నిందలు,ఆరోపణలు అవాస్తవమని చెప్పగలిగే సత్తా టీడీపీ(TDP) శ్రేణుల్లో కరువైంది. ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదు. వాస్తవాలు గుర్తించి కార్యక్షేత్రంలోకి దుంకితేనే పూర్వ వైభవం టీడీపీకి దక్కుతుంది. లేదంటే కాలగమనంలో గుర్తుగా ఉండి పోతుంది అంతే..
Also Read : Minister KTR : విద్యతోనే వికాసం – కేటీఆర్