TDP MP Kesineni Nani: కేశినేని నానికి చంద్రబాబు షాక్ ?
కేశినేని నానికి చంద్రబాబు షాక్ ?
TDP MP Kesineni Nani: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో రచ్చ ప్రారంభమైయింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. విజయవాడ ఎంపీ సీటును కేశినేని నానికి కాకుండా వేరొకరికి కేటాయిస్తున్నట్లు టిడిపి అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ… పార్టీకు చెందిన కీలక నాయకుల చేత ఇదే విషయాన్ని ఎంపీ నానికు ఇటీవల చేరవేసింది.
చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఈ విషయాన్ని ఎంపీ కేశినేని నానికు(Kesineni Nani) ఈ విషయాన్ని చేరవేయడంతో పాటు ఈ నెల 7న తిరువూరులో జరగబోయే సభకు వేరొకరిని ఇన్ చార్జ్ గా నియమించినందున… ఆ సభ ఏర్పాట్లు, నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోవద్దని సూచించారు. దీనితో ఇదే విషయాన్ని ఎంపీ నాని తన ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ చేసారు. దీనితో ఎంపీ నాని పెట్టిన ఫేస్ బుక్ పోస్టు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
TDP MP Kesineni Nani – ఎంపీ నాని తనఫేస్ బుక్ పోస్ట్ లో ఏమన్నారంటే ?
‘‘అందరికీ నమస్కారం. గురువారం సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నన్ను కలిశారు. ఈనెల 7న తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్‌ఛార్జ్‌గా నియమించినందున ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు చెప్పినట్లు వారు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా నా స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని… పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. అధినేత ఆజ్ఞలను తు.చ. తప్పకుండా శిరసావహిస్తానని నేను వారికి హామీ ఇచ్చా’’ అని కేశినేని నాని తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు.
దీనిని బట్టి రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్‌ను వేరే వ్యక్తికి ఇవ్వాలని టిడిపి(TDP) అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్, సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ కేశినేని నానిను తప్పించి వేరొకరి ఇవ్వాలన్న సందేశాన్ని పార్టీ దూతలతో నానికి పంపించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అధినేత ఆదేశాలను శిరసావహిస్తారని చెప్తూనే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఎంపీ కేశినేని నాని వెల్లడించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
నాని నోటి దురుసు టిక్కెట్టును దూరం చేసిందా ?
2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఫ్యాన్ గాలిలో కూడా… టిడిపి ఎదురొడ్డి నిలబడి గెలిచింది కేవలం కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు మాత్రమే. అయితే కేశినేని నాని(Kesineni Nani) విజయంలో కీలక పాత్ర పోషించిన అతని సోదరుడు కేశినేని చిన్ని… ఇటీవల సోదరుడికి దూరంగా ఉంటున్నారు. వారిద్దరి మధ్య తలెత్తిన వివాదాలు చివరకు ఎంపీ సీటుకు చేటు తెచ్చేలా చేస్తున్నాయి.
ఇటీవల తిరువూరు సభ ఏర్పాట్ల విషయంలో బుధవారం కేశినాని నాని, అతని సోదరుడు చిన్ని వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తిరువూరు ఇన్ చార్జి, దళిత నాయకుడు దేవదత్ ను ఉద్దేశ్యించి పూజకు పనికిరాని పువ్వు అంటూ ఎంపీ కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేసారు. నాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపికు చెందిన కొంతమంది దళిత నాయకులు, టిడిపి(TDP) అధినేత చంద్రబాబు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం ఈ సభను విజయవంతం చేసేందుకే నానిను అక్కడి నుండి తప్పించారా ? లేదా నాని నోటి దురుసును సాకుగా చూపి విజయవాడ ఎంపీ టిక్కెట్టు వేరొకరికి కేటాయించారా ? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Also Read : PM Modi Explores : మోదీని ఆకట్టుకున్న లక్షద్వీప్ అందాలు