Telangana Election Comment : పార్టీల జపం గెలుపు మంత్రం
అందరూ గెలిస్తే ఓడేదెవరో మరి
Telangana Election Comment : కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగారా మోగించింది. 5 రాష్ట్రాలకు సంబంధించి శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. తేదీలు కూడా ఖరారు చేసింది. మొత్తంగా వచ్చే ఏడాది జనవరి లోపు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇందుకు పూర్తి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలు పూర్తిగా నిమగ్నమయ్యాయి. ఇక ఎన్నికల కోడ్ కూడా వచ్చేసింది. ప్రభుత్వాలు నామ మాత్రంగానే వ్యవహరిస్తాయి. యావత్ దేశాన్ని ప్రభావితం చేయనున్నాయి ఈ ఎన్నికలు.
ఇక తెలంగాణ వరకు వస్తే రాజకీయం మరింత రంజుగా మారి పోయింది. దేశంలో మిగతా రాష్ట్రాలు ఒక ఎత్తు. దక్షిణాదిన ఎక్కువ పొలిటికల్ చైతన్యం కలిగిన ప్రాంతంగా తెలంగాణకు పేరుంది. సుదీర్ఘమైన పోరాటాలు, ఉద్యమాలకు, బలిదానాలకు పెట్టింది ఈ గడ్డ. దీనిని తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదు. రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో కదన రంగంలోకి దూకేందుకు పావులు కదుపుతున్నాయి.
Telangana Election Comment Viral
అన్ని పార్టీలు ఎవరికి వారే తామే గెలుస్తామంటూ ముందస్తుగానే ప్రకటిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ అయితే ఆ పార్టీ చీఫ్ ఏకంగా తాను సీఎం అయి పోయినట్లు హెచ్చరికలు జారీ చేయడం మొదలు పెట్టారు. ఇది ఒకింత విస్తు పోయేలా చేస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఎవరు గెలుస్తారనే దానిపై గతంలో కంటే భిన్నంగా ఈసారి పలు సర్వే సంస్థలు గంప గుత్తగా తమకు తోచిన రీతిలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యే అసలు సిసలైన పోటీ నెలకొంటుందని, ఈసారి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ కు కష్ట కాలమే ఉందని పేర్కొంటున్నాయి. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి అవుతాయి. కొత్త సర్కార్ డిసెంబర్ 9 నాటికి పూర్తవుతుంది. కొలువు తీరిన బీఆర్ ఎస్ తో పాటు కాంగ్రెస్(Congress) , భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం, బహుజన్ సమాజ్ పార్టీ , వైఎస్సార్ తెలంగాణ పార్టీ, ఇండిపెండెంట్లు బరిలో ఉండే ఛాన్స్ ఉంది.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రస్తుతం సంక్షేమ పథకాలను నమ్ముకుంది. రైతు బంధు, దళిత బందు, ఆసరా పెన్షన్లు, షాదీ ముబారక్ , ఐటీ హబ్ , ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణం తమను గట్టెక్కిస్తాయని భావిస్తోంది. అయితే కబ్జాలు, అవినీతి ఆరోపణలు, దాడులు, కేసుల నమోదు, మద్యం, డ్రగ్స్, ఖాకీల కండ కావరం, మంత్రులు, ప్రజా ప్రతినిధుల ఓవర్ యాక్షన్ ఆ పార్టీకి మైనస్ గా మారింది. కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఇక రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ప్రభుత్వ వ్యతిరేకత తమను గట్టెక్కిస్తుందని భావిస్తోంది. ఆ పార్టీ పొరుగున ఉన్న కర్ణాటకలో బీజేపీకి షాక్ ఇస్తూ పవర్ లోకి వచ్చింది.
సేమ్ సీన్ తెలంగాణలో రిపీట్ అవుతోందని అనుకుంటోంది. కాక పోతే పార్టీలో ఆధిపత్య పోరు, సీట్ల పంపకం ఇబ్బందిగా మారింది. ఇక బీజేపీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆ పార్టీకి ఇప్పటికే ఓ ముద్ర పడి పోయింది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రజలు నమ్ముతున్నారు. మరో వైపు టీడీపీ, బీఎస్పీ, వైస్సార్ టీపీ ఓట్లను చీల్చనున్నాయి. ఇక ఎంఐఎం గురించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ పార్టీ గులాబీతో జత కట్టింది. దానిపై జనాలకు పెద్దగా అంచనాలు లేవు. మొత్తంగా ప్రతి పార్టీ తామే గెలుస్తామని బీరాలు పలుకుతోంది. మరి అందరూ గెలిస్తే ఓడి పోయేది ఎవరని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
Also Read : Shashi Tharoor : మోదీ సర్కార్ బేకార్ – శశి థరూర్