Telangana Elections : 32 స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన

జనసేన క్యాడర్ ప్రకటించింది

Telangana Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలను జనసేన ప్రకటించింది. మొత్తం 32 స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు జనసేన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రేపో, మాపో నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారంతో పార్టీలు అభ్యర్థుల ప్రకటన, ప్రచారాలపై దృష్టిపెట్టాయి. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన.. పోటీ చేసే స్థానాలను ఖరారు చేసింది. తెలంగాణలో మొత్తం 32 స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, వైరా, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, మునుగోడు, కుత్బుల్లాపూర్‌, శేర్‌లింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్‌, కొత్తగూడెం, ఉప్పల్‌, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌, హుస్నాబాద్‌, రామగుండం, జగిత్యాల, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్‌ వెస్ట్‌, వరంగల్‌ ఈస్ట్‌, ఖానాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్‌, పాలేరు, ఇల్లందు, మధిరలో జనసేన పోటీ చేయనున్నట్లు పేర్కొంది.

Telangana Elections Janasena Contest Areas

తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన స్థానాలను ఆ పార్టీ ఉపాధ్యక్షులు బోంగునూరి మహేందర్ రెడ్డి హైదరాబాద్ లో ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ అంశంపై పూర్తి సన్నదతతో ఉన్నామని మహేందర్ రెడ్డి అన్నారు. ఈసారి పోటీలో జనసేన ఉంటుందని, ఒకవేళ చివరి క్షణంలో పొత్తులు ఏమైనా ఉంటే స్థానాల్లో మార్పు రావచ్చన్నారు. సింగిల్ గా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గత 10 సంవత్సరాల్లో అనేక సమస్యలపై తెలంగాణలో జనసేన పార్టీ(Janasena) పోరాటం చేసిందన్నారు. నల్లమల యురేనియం తవ్వకాలు, మహిళలపై దాడులు, డ్రగ్స్ సమస్య, ఆర్టీసీ కార్మికుల సమస్య, బీసీ, ఎస్టీ వర్గాల సమస్యలు, విద్యార్థుల సమస్యలు ఇలా అనేక సమస్యలపై జనసేన పార్టీ పోరాటం చేసిందన్నారు.

తెలంగాణలో జనసేన పార్టీ బలంగా ఉందని మహేందర్ రెడ్డి తెలిపారు. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ సానుభూతిపరులు, మెగా అభిమానులు పార్టీకి అండగా నిలబడ్డారన్నారు. 32 నియోజకవర్గాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని, పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేయనున్నారని ప్రకటించారు. తెలంగాణలో పొత్తుల అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పవన్ కల్యాణ్ సూచనల మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ప్రధానంగా జనసేన పార్టీ పోటీ చేయనుందని మహేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ క్యాడర్ బలంగా ఉన్న 32 నియోజకవర్గాల్లో ఇప్పటికే కమిటీలు వేశామని, అక్కడ పార్టీ బలంగా పనిచేస్తుందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ గడ్డపై పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. గత ఎన్నికల్లో 7 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేశామని, ఈసారి రానున్న ఎన్నికల్లో దాదాపు 32 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయనుందన్నారు.

Also Read : Delhi Police : 7 మంది జర్నలిస్టుల ఇళ్లపై స్పెషల్ సెల్ ముందస్తుగా దాడులు నిర్వహించింది.

Leave A Reply

Your Email Id will not be published!