Telangana Formation Day: పరేడ్‌ గ్రౌండ్‌ లో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు !

పరేడ్‌ గ్రౌండ్‌ లో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు !

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను వచ్చే నెల(జూన్‌) 2న సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి తెలిపారు. ఆ రోజు సీఎం రేవంత్‌ రెడ్డి గన్‌ పార్క్‌ ను సందర్శించి, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారని ఆమె పేర్కొన్నారు. నిర్వహణ ఏర్పాట్లపై ఆమె శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ… రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో తగిన విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రముఖులకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, రాకపోకలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీసుశాఖకు సూచించారు. ప్రజలు ఎండకు గురికాకుండా షామియానాలు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖను ఆదేశించారు. తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, సభా పరిసరాలు ఆకర్షణీయ అలంకరణలతో ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు, పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖకు సూచించారు. నిరంతరాయంగా త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ సమీక్షలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హా, ముఖ్య కార్యదర్శులు బి.వెంకటేశం, జితేందర్, కార్యదర్శులు క్రిస్టినా చోంగ్తూ, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు ఎండీ సుదర్శన్‌రెడ్డి, టీఎస్‌పీడీసీఎల్‌ ఎండీ ముషారఫ్, సీడీఎంఏ దివ్య, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Telangana Formation Day – ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానించనున్న సీఎం రేవంత్‌ !

తెలంగాణ(Telangana) ఆవిర్భావ వేడుకలకు ముఖ్యఅతిథిగా సోనియాగాంధీని ఆహ్వానించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నిమిత్తం సీఎం సహా కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఒకట్రెండు రోజుల్లో దిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ విషయంపై సోనియాగాంధీ అపాయింట్‌ మెంట్‌ కోరినట్లు తెలుస్తోంది.

Also Read : Medha Patkar: పరువు నష్టం కేసులో దోషిగా మేధాపాట్కర్‌ !

Leave A Reply

Your Email Id will not be published!