Telangana Government: 24 లక్షల తెలుగు పాఠ్య పుస్తకాలు వెనక్కి పంపించిన తెలంగాణా ప్రభుత్వం !
24 లక్షల తెలుగు పాఠ్య పుస్తకాలు వెనక్కి పంపించిన తెలంగాణా ప్రభుత్వం !
Telangana Government: తెలుగు పాఠ్యపుస్తకం ముందు మాటలో తప్పులపై తెలంగాణా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రాధారెడ్డిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. అంతేకాదు పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేశ్‌కు బాధ్యతలు అప్పగించారు. టీఆర్‌ఈఐఎస్ కార్యదర్శి రమణ కుమార్‌కి ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు కేటాయించారు.
Telangana Government…
తెలంగాణ(Telangana)లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసిన తెలుగు వాచకం పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోనున్నారు. పంపిణీ చేయని వాటిని పిల్లలకు ఇవ్వకుండా నిలిపివేశారు. 24 లక్షల పుస్తకాల్లోని ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు, అధికారుల పేర్లను ముద్రించారు. ఏళ్ల క్రితం నాటి ముందుమాటలో మార్పులు చేయకుండా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. బుధవారం పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తున్న సమయంలో ముందుమాటలోని తప్పులను చాలాచోట్ల ఉపాధ్యాయులు గుర్తించి విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చారు.
తొలుత ఆ పేజీని చించేయాలని ఆదేశించిన అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ పేజీని తొలిగిస్తే దాని వెనుకున్న వందేమాతరం, జాతీయ గీతం, ప్రతిజ్ఞ లేకుండా పోతాయి. అప్పుడు మరిన్ని విమర్శలు వస్తాయని భావించారు. దాంతో పిల్లలకిచ్చిన, ఇవ్వని పుస్తకాలన్నీ వెనక్కి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన డీఈఓలను ఆదేశించారు. వాటిని మండల వనరుల కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఆ పేజీ మొత్తం కనిపించకుండా స్టిక్కర్ వేసి అందజేయనున్నారు. తెలుగు వర్క్ బుక్స్‌నూ వెనక్కి తీసుకుంటున్నారు.
Also Read : MK Stalin: నీట్ కుంభకోణంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆశక్తికర వ్యాఖ్యలు !