Telangana Police: ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీ చేసిన తెలంగాణ పోలీసులు
ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీ చేసిన తెలంగాణ పోలీసులు
Telangana Police : తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ చిక్కుల్లో పడ్డారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఏఐ సహాయంతో రూపొందించిన ఫేక్ ఫోటోలను ఆమె తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ లో పోస్ట్ చేసినందుకు… తెలంగాణ పోలీసులు(Telangana Police) ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న “హాయ్ హైదరాబాద్” అనే ఎక్స్ హ్యాండిల్ పోస్టు చేసిన గిబ్లీ ఫొటోను స్మితా సభర్వాల్ తన సోషల్ మీడియాలో రీపోస్ట్ చేశారు. అయితే ఆ ఫోటోలో హెచ్‌సీయూ మష్రూమ్ రాక్ ఎదుట భారీగా బుల్డోజర్లు ఉన్నట్లు ఉంది. అలాగే వాటి ముందు నెమలి, జింకలు ఉన్నాయి. ఈ పోస్టుని ఐఏఎస్ స్మితా సబర్వాల్(Smita Sabharwal) తన ఎక్స్ ఖాతాలో రీపోస్టు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఫేక్ ఫొటోగా తేల్చారు. ఈ మేరకు ఆమెకు BNS 179 సెక్షన్ కింద నోటీసులు అందించారు.
Telangana Police Gives Notices to IAS
కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి పెద్దఎత్తున వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 400 ఎకరాల భూముల్లో చెట్లు తొలగించేందుకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం ప్రయత్నించగా… హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ మేరకు పెద్దఎత్తున ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీనిపై పలువురు హైకోర్టు, సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా దీనిపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. పదుల కొద్దీ బుల్డోజర్లతో చెట్లను తొలగిస్తున్నారని, అక్కడున్న జీవరాశులకు ఆశ్రయం లేకుండా చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఈ వివాదానికి సంబంధించి ఏఐ సహాయంతో రూపొందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆ ఫోటోల్లో నెమళ్ళు, జింకలు ఎగిపోతున్నట్లు… ప్రభుత్వ నిర్ణయంతో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లినట్లు ఏఐతో రూపొందించిన ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటోలు నిజమని అనుకున్న కొంతమంది సెలబ్రెటీలు… రాజకీయ నాయకులు వాటిని చూసి స్పందించడమే కాకుండా ఆ ఫోటోలను రీ పోస్ట్ చేసారు.
అయితే రాజకీయ దురుద్దేశ్యంతో విపక్ష పార్టీలు ఏఐ సహాయంతో రూపొందించిన ఫేక్ ఫోటోలను రూపొందించి… ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఏఐ ఫోటోలు పోస్ట్ చేసిన వారిపై, షేర్ చేసిన వారిపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అలాంటి వారిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే పలువురి నోటీసులు ఇచ్చిన పోలీసులు… కొంతమంది బీఆర్ఎస్ నేతలపైనా కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఫేక్ ఫొటోలు రీపోస్టు చేశారంటూ తాజాగా నోటీసులు అందించారు.
స్మితా సబర్వాల్ పోస్టుపై చట్టప్రకారం ముందుకెళ్తాం – మంత్రి శ్రీధర్‌బాబు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో… ‘‘నకిలీ వీడియోస్, ఫొటోలు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయి. భూముల విషయం కోర్టుల పరిధిలో ఉన్నందున ఏమీ మాట్లాడలేం. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై చట్టప్రకారం ముందుకు వెళ్తాం. నెమళ్లు జనావాసాల్లోకి రావడం సర్వసాధారణం. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే కుట్ర పన్నుతున్నట్లు భావిస్తున్నాం. రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే ఈ భూములపై ప్రధాని మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నారు. కూలగొడితే కూలిపోయే ప్రభుత్వం కాదు మాది’’ అని శ్రీధర్‌బాబు అన్నారు.
Also Read : Poisoning Attempt: ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగానికి ప్రయత్నం ! నిందితుడు అరెస్టు !