TG News : ఆ రోజు వరకు డ్రోన్లు, పారా గ్లైడర్లు ఎగరవేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న సీపీ

కాగా..బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్న భవనాన్ని 1860లో నిజాం నవాబు నజీరుద్దౌలా నిర్మించారు...

TG News : హైదరాబాద్ నగరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఇవాళ(మంగళవారం) రానున్నారు. ఈ నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్‌, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రత ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన సందర్భంగా పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారా గ్లైడర్లు ఎగరవేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి హెచ్చరించారు.ఈరోజు నుంచి 21వ తేదీ వరకు డ్రోన్లు, పారా గ్లైడర్లు, మైక్రో లైట్ ఎయిర్ క్రాప్ట్‌లు ఎగురవేతపై సీపీ నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

TG News Update

కాగా..బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్న భవనాన్ని 1860లో నిజాం నవాబు నజీరుద్దౌలా నిర్మించారు. సాలర్‌జంగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో బొల్లారం నిజాం ప్రభుత్వం అధీనంలోని ఒక కంటోన్మెంట్‌ ప్రాంతంగా ఉండి, ప్రధాన సైనికాధికారి నివాసంగా ఉండేది. 1950లో హైదరాబాద్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దక్షిణాదిలో రాష్ట్రపతి విడిది కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో అతిథి గృహంగా మార్చి ఈ భవనాన్ని రాష్ట్రపతి నిలయంగా నామకరణం చేశారు. 90 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో భవనాన్ని 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో మూడు ప్రధాన విభాగాలు ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి, కుటుంబ సభ్యులు, ఏడీసీ విభాగాలుగా విభజించారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో మరో 20 గదులను నిర్మించారు.

దేశప్రథమ రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ నుంచి మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వరకు ప్రతి ఏడాది శీతాకాల విడిది కోసం వచ్చారు. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) కూడా మిగతా రాష్ట్రపతుల మాదిరిగానే శీతాకాల విడిది కోసం నగరానికి మొదటిసారి రాష్ట్రపతి హోదాలో వస్తున్నారు. రాష్ట్రపతి నిలయం పరిసరాల చుట్టూ రక్షణ విభాగాల దళాలు ఉండటంతో భద్రతాపరంగా పటిష్ఠంగా ఉంది. రాష్ట్రంలోని మిలిటరీ వ్యవహారాలను పర్యవేక్షించే ఆంధ్రా, తెలంగాణ సబ్‌ ఏరియా కమాండెంట్‌ ప్రధాన కార్యాలయం కూడా రాష్ట్రపతి నిలయాన్ని ఆనుకొని ఉంది. సీడీఎం, ఈఏఈ, ఎంసీఈఎంఈ, ఏఓసీ తదితర రక్షణ విభాగాలు ఇక్కడ ఉన్నాయి.

రాష్ట్రపతిద్రౌపది ముర్ము(Droupadi Murmu) శీతాకాల విడిది కోసం నగరానికి వస్తున్న సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్ల ఆధునికీకరణ పనులు చేపట్టడంతో ప్రభుత్వం విభాగాల అధికారులు తలమునకలయ్యారు. రాష్ట్రపతి నిలయంలోని దట్టమైన పొదలను తొలగించడం, పచ్చదనం పెంచడం, తాగునీటి సదుపాయం కల్పించడం, పారిశుధ్య నిర్వహణ తదితర పనులను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు సంయుక్తంగా చేపడుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోసం రాష్ట్రపతి నిలయాన్ని ఆనుకొని ఉన్న ఈఎంఈ పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రత్యేక హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రయాణించడానికి వీలుగా హెలిప్యాడ్‌ను అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు హెలిక్యాప్టర్‌లో ప్రయాణించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read : MLA Harish Rao : కాంగ్రెస్ సర్కార్ పై భగ్గుమన్న మాజీ మంత్రి హరీష్ రావు

Leave A Reply

Your Email Id will not be published!