TGPSC: బీఆర్‌ఎస్ నేత రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు
బీఆర్‌ఎస్ నేత రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు
TGPSC : గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి అసత్య ఆరోపణలపై బీఆర్‌ఎస్(BRS) నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది. గ్రూప్ 1 ఫలితాల విషయంలో తమపై చేసిన తప్పుడు ఆరోపణలకు వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని ఈ నోటీసుల్లో టీజీపీఎస్సీ(TGPSC) డిమాండ్ చేసింది. వారం రోజుల్లో సమాధానం చెప్పనట్లైతే పరువునష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించింది. అంతేకాదు తదుపరి టీజీపీఎస్సీపై రాకేష్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దని ఆంక్షలు విధించింది.
TGPSC – అసలు రాకేష్ రెడ్డి ఏమన్నారంటే ?
గ్రూప్ 1 మెయిన్స్‌లోని అన్ని పేపర్లను రీ వాల్యుయేషన్ చేయాలని, వాల్యుయేషన్‌లో జరిగిన తప్పిదాలను ప్రభుత్వం సరిద్దాలని రాకేష్ రెడ్డి ఇటీవల పెట్టిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. గ్రూప్ 1లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. గ్రూప్ -1 మెయిన్స్ రాసిన వారిలో 40 శాతం తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారని… కానీ వారిలో ఒక్కరు కూడా టాప్ ర్యాంకులో రాలేదని తెలిపారు. ఈ మెయిన్స్ పరీక్షలను 45 కేంద్రాల్లో నిర్వహిస్తే కేవలం రెండు కేంద్రాల్లోనే 72 మంది ఎలా ట్యాప్ ర్యాంక్ లో నిలిచారో టీజీపీఎస్సీ చెప్పాలన్నారు. టీజీపీఎస్సీ ద్వారా తెలుగు మీడియంను చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు.
అంతేకాదు 18, 19వ కేంద్రాల్లో అవకతవలకు జరిగాయనే అనుమానం ఉందన్నారు. ఏపీపీఎస్సీలో 6 వేల పేపర్లను దిద్దేందుకు 40 రోజుల సమయం తీసుకుంటే… ఇప్పుడు 20 వేల పేపర్లను అతి తక్కువ సమయంలో ఎలా దిద్దారని ప్రశ్నించారు. గ్రూప్ పరీక్షల నిర్వహణే తప్పుల తడక అంటూ రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై టీజీపీఎస్సీ సీరియస్ అయ్యింది. తప్పుడు ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిందే అంటూ రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది.
రేవంత్‌రెడ్డికి నోటీసులు ఎందుకివ్వలేదు – రాకేశ్‌రెడ్డి
మరోవైపు టీజీపీఎస్సీ నోటీసులపై రాకేశ్‌రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇలాంటి నోటీసులకు భయపడబోనని, గ్రూప్-1 పరీక్షలో అవకతవకలపై ప్రశ్నిస్తే తనపై పరువు నష్టం దావా వేశారని అన్నారు. ప్రశ్నిస్తేనే పరువు పోతే… మరి జీవితాలను కోల్పోతున్న నిరుద్యోగులు ఏం చేయాలని ప్రశ్నించారు? ‘‘ గతంలో రేవంత్‌రెడ్డి ఇదే టీఎస్‌పీఎస్సీపై ఎన్నో విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డికి ఇలాంటి నోటీసులు ఎందుకివ్వలేదు? మీ దావాపై త్వరలోనే వివరంగా సమాధానం ఇస్తా’’ రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు.
Also Read : Intelligence Alert: దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చు నిఘా సంస్థల హెచ్చరిక