Most Powerful Women : అత్యంత శక్తివంతమైన ప్రపంచ మహిళలు

Most Powerful Women : ప్రపంచం కోవిడ్‌-19 విషవలయంలో చిక్కి సతమతమవుతున్న వేళ అన్ని అవాంతరాలను అధిగమిస్తూ తమ పదవులు, వృత్తి, వ్యాపారరంగాల్లో తారా జువ్వల్లా దూసుకు పోతున్న మహిళలు మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Most Powerful Women: ప్రపంచం కోవిడ్‌-19 విషవలయంలో చిక్కి సతమతమవుతున్న వేళ అన్ని అవాంతరాలను అధిగమిస్తూ తమ పదవులు, వృత్తి, వ్యాపారరంగాల్లో తారా జువ్వల్లా దూసుకు పోతున్న మహిళలు మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో రాణించిన ఫోర్బ్స్ ప్రపంచ అత్యంత శక్తివంతమైన మహిళల (వరల్డ్ మోస్ట్ పవర్‌ఫుల్‌ వూమెన్‌) జాబితాలో 100 మందిని ఫోర్బ్స్ సంస్థ గుర్తించింది. 2004 నుండి ఫోర్బ్స్ సంస్థ ఇలాంటి జాబితాలను ప్రతియేటా ప్రకటిస్తున్నది. ఈ ఏడాది 100 మంది జాబితాలో 41, 55 మరియు 68 స్థానాల్లో భారతీయ ధీరవనితలు కూడా ఉండడం విశేషం.

1. ఎంజెలా మార్కెల్‌:

2005లో జర్మనీ ప్రథమ చాన్సిలర్‌గా పదవి చేపట్టి నాలుగవ దఫా కూడా ఆ పదవిలో కొనసాగిన ఎంజెలా మార్కెల్‌, యూరప్‌లో ప్రముఖ నాయకురాలుగా మరియు జర్మనీ ఆర్థిక దుస్థితికి వైద్యం చేసి గాడిలోకి తీసుకువచ్చిన ధీర వనితగా పేరుగాంచారు. తన నాయకత్వంతో అమెరికాతో కలిసి ఒక మిలియన్‌ సిరియన్‌ శరనార్థులకు ఆశ్రయమిచ్చే ధైర్యం చేశారు. యూరప్‌కు చెందిన 14 దేశాల 75 శాతం పౌరులు మెచ్చిన ఉత్తమ మరియు శక్తివంతమైన మహిళగా నిలిచారు. 2006 నుంచి ప్రతియేటా (2010 మినహ) ప్రథమ స్థానంలోనే ఉంటూ పవర్‌ఫుల్‌ వూమెన్‌గా పేరు నిలుపుకుంటున్నది.

2. క్రిస్టైన్‌ లగార్డే:

యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్ ప్రథమ మహిళా‌ అధిపతిగా నవంబర్‌ 2019లో బాధ్యతలు చేపట్టి, యూరోపియన్‌ మానిటరీ పాలసీ నాయకురాలుగా కరోనా కల్లోలకాలంలో పలు ఫలవంతమైన నిర్ణయాలు తీసుకొని అందరి ప్రశంసలు పొందారు. 2011 – 2019 కాలంలో ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌, ఐయంయఫ్‌ సంస్థలో సేవలందించిన లగార్డే ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితాలో 2వ స్థానం ఆక్రమించింది.

3. కమలా హారిస్‌:

ఇటీవల అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన భారత సంతతికి చెంది అమెరికన్‌ మహిళ కమలా హారిస్‌. 2016లో సెనేటర్‌గా మరియు 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్ అయిన కమల ప్రథమ నల్లజాతి ప్రవాస మహిళా ఉపాధ్యక్షురాలుగా పేరొందారు.

4. ఉర్సులా వోన్‌ డెర్‌ లెయెన్‌:

2019లో ఉర్సులా వోన్‌ డెర్‌ లెయెన్‌ యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన యూరోపియన్‌ కమీషన్ ప్రథమ మహిళా‌ అధ్యక్షురాలుగా 700 మిలియన్ల యూరోపియన్ ప్రజలకు సేవలందించే గురుతర బాధ్యతలు చేపట్టారు. 2005 నుంచి 2019 వరకు జర్మనీ ఎంజెలా మార్కెల్‌ కేబినెట్లో అత్యధిక కాలం పని చేశారు. గత 6 సంవత్సరాలుగా జర్మనీ రక్షణశాఖ మంత్రిగా సేవలందించారు.

5. మిలిండా గేట్స్:

బిల్‌ – మిలిండా గేట్స్ ఫౌండేషన్‌ కో-చైర్‌పర్సన్‌గా అత్యంత దాతృత్వం చూపిన శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొందారు. 2000 సంవత్సరంలో ఏర్పడిన ప్రపంచ అతి పెద్ద సేవా సంస్థగా 40 బిలియన్‌ డాలర్ల వితరణ వేదికగా బిల్‌-మిలిండా గేట్స్ ఫౌండేషన్‌ నిలిచింది. ప్రపంచ పేద దేశాల్లో విద్య, పరిసరాల పరిశుభ్రత, కుటుంబ నియంత్రణ మరియు వైద్య సేవల కోసం పథకాలు రచించుటలో మిలిండా సఫలీకృతం అయ్యింది. మహిళలు మరియు బాలికల ఆరోగ్యం, సంతానం కోసం తన అనుభవాన్ని మరియు ట్రస్ట్ నిధిని వెచ్చిస్తున్నారు.

6. మరొ బర్రీ:

అమెరికాలో 3వ అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీ జనరల్‌ మోటార్స్ సిఈఓగా 2014 నుంచి పని చేస్తున్నారు. బర్రీ చొరవ చూపి బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టి ఎలక్ట్రిక్‌ వాహనాలు, సెల్ఫ్ డ్రైవింగ్‌ కార్లు మరియు రైడ్‌ షేర్‌ సర్వీసులు తయారు చేస్తున్నారు. 2019లో 21.6 మిలియన్‌ డాలర్లు సంపాదించి, ‘డెట్రాయిట్‌ బిగ్‌ త్రీ ఆటోమేకర్’‌గా గుర్తింపు పొందారు.

7. నాన్సీ పెలోసి:

అమెరికా పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రసెంటేటివ్స్ 52వ సభాధ్యక్షురాలిగా 3వ సారి నాన్సీ పెలోసి పని చేసి, అధ్యక్షుడి తరువాత స్థానం ఆక్రమించారు. 2013లో అమెరికా నేషనల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌గా గౌరవాన్ని పొందారు.

8. అనా పాట్రిసియా బోటిన్‌:

అనా పాట్రిసియా బోటిన్‌ తండ్రి ఇమిలియో ఆకస్మిక మరణంతో 2014లో సాంతాండర్‌ కంపెనీ అధిపతిగా పగ్గాలు చేపట్టారు. రాజకీయ అస్థిరత్వంలో కూడా తన ప్రతిభను ప్రదర్షించి ఔత్సాహికులు, చిన్న పరిశ్రమలకు చేయూత నిచ్చి పేరు తెచ్చుకున్నారు. సాంతాండర్-X కంపెనీ వేదికగా విశ్వవిద్యాలయాలకు సహకారాలు అందజేశారు.

9. అబిజైల్‌ జాన్సన్‌:

2014 నుంచి ప్రముఖ ఫిడలైట్‌ పెట్టుబడుల సంస్థకు సిఈఓగా పని చేస్తున్న అబిజైల్‌ జాన్సన్‌, 2016 నుంచి చైర్‌ పర్సన్‌గా విధులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కంపెనీలో 24.5 శాతం వాటా కలిగిన జాన్సన్‌ 2.9 ట్రిలియన్ల ఆస్తులు సంపాదించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో యంబిఏ పూర్తి చేసిన జాన్సన్‌ 1988లో మంచి అనలిస్టుగా కూడా రుజువు చేసుకున్నారు.

10. గేయిల్‌ బోడ్రియాక్స్:

అతి పెద్ద హెల్త్ కేర్‌ గ్రూప్‌ ‘ఆంథెమ్’‌ కంపెనీ సిఈఓగా 2017లో పదవి చేపట్టి, ఆంథెమ్‌ ఫౌండేషన్‌ ద్వారా 53 మిలియన్ డాలర్లు వెచ్చించి అమెరికన్ల ఆరోగ్య సంరక్షణకు పాటు పడ్డారు. పదవి చేపట్టిన మెుదటి రెండు సంవత్సరాల్లోనే స్టాక్‌ మార్కెట్‌లో కంపెనీ షేర్ల విలువ 20 శాతం వరకు పెంచగలిగారు.
ఫోర్బ్స్ శక్తివంతమైన ప్రపంచ 100 మంది మహిళల్లో భారతీయ మహిళలు కూడా ముగ్గురు ఉండడం విశేషం.

 

నిర్మల సీతారామన్(41వ స్థానం)‌:

భారతీయ నిర్మల సీతారామన్‌ ఇండియా కేంద్ర మంత్రివర్గంలో ఆర్థిక మరియు కార్పొరేట్‌ విభాగ శాఖల మంత్రిగా మే 2019 నుంచి బాధ్యతలు చేపట్టారు. భారత ఆర్థికశాఖ తొలి మహిళా మంత్రిగా సమర్థవంతంగా సేవలందిస్తున్నారు. ఫోర్బ్స్ జాబితాలో 41వ స్థానాన్ని పొందిన నిర్మల బిబిసి మరియు యూకె ఆధార అగ్రికల్చరల్‌ ఇంజనీర్ల అసోసియేషన్‌లలో పని చేసిన అనుభవం కూడా ఉన్నది.

రోష్నీ నాడర్‌ మల్హోత్ర(55వ స్థానం):

ఫోర్బ్స్ జాబితాలో 55వ స్థానంలో ఉన్న రోష్నీ నాడర్‌ మల్హోత్ర ప్రముఖ హెచ్‌సియల్‌ కంపెనీ సిఈఓ మరియు కార్యనిర్వాహక డైరెక్టర్‌గా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. 8.9 బిలియన్‌ డాలర్ల ఐటీ కంపెనీ పగ్గాలను తన తండ్రి శివ్‌ నాడర్‌ నుండి చేపట్టారు. జూలై 2020 నుండి చైర్‌ పర్సన్‌ బాధ్యతలు చేపట్టన రోష్నీ, శివ్‌ నాడర్‌ ఫౌండేషన్‌ ట్రస్టీగా సేవలు అందిస్తున్నారు.

కిరణ్‌ మజుందార్‌ షా(68వ స్థానం):

అతి పెద్ద బయోఫార్మా కంపెనీ ‘బయోకాన్‌ లిమిటెడ్‌’ వ్యవస్థాపకురాలు, చైర్‌ పర్సన్‌ మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కిరణ్‌ విశిష్ట సేవలు అందిస్తున్నారు. స్వయంకృషితో ఎదిగిన కిరణ్‌ ఆసియాలో అత్యధిక 3 బిలియన్‌ ఇన్సులిన్‌ డోసులు అందుబాటులోకి తెచ్చారు. కోవిడ్‌-19 వ్యాక్సీన్‌ తయారీలో 4వ దశ ప్రయోగాలు చేస్తున్నారు. దాతృత్వగుణం కలిగిన కిరణ్‌ ‘మజుందార్‌ షా మెడికల్‌ సెంటర్‌’ ద్వారా క్యాన్సర్‌ చికిత్సలో ఉచిత సేవలు అందిస్తున్నారు. ఈ జాబితాలో 68వ స్థానంలో ఉన్న కిరణ్‌ ఆస్తుల విలువ 4.6 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు.

ప్రపంచ జాబితాలో భారతీయులు వెలుగులు నింపాలని, అన్ని రంగాల్లో మన వారు అగ్రస్థానాలు ఆక్రమించాలని, అగ్రదేశాల సరసన సగర్వంగా చేరాలని ప్రతి బాధ్యతగల భారతీయ పౌరుడు ఆశిస్తున్నాడు. 2020 ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న అత్యంత శక్తివంతమైన భారతీయ మహిళలు నిర్మల సీతారామన్‌, రోష్నీ నాడర్‌ మల్హోత్ర మరియు కిరణ్‌ మజుందార్‌ షాలకు శుభాకాంక్షలు అందిద్దాం, అభినందిద్దాం.

No comment allowed please