Ratan Tata : ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్స్ అధినేత ‘రతన్ టాటా’ కన్నుమూత

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే విద్యార్థిలాగా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవారు...

Ratan Tata : భారత దేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది! జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక వేత్త, చైర్మన్‌ ఎమెరిటస్‌ ఆఫ్‌ టాటా(TATA)సన్స్‌.. రతన్‌ నావల్‌ టాటా(Ratan Tata) (86) ఇక లేరు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి.. ఆకాశంలో ఎగిరే విమానాల దాకా.. ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్యజీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని రెండు దశాబ్దాలపాటు నడిపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం.. మరలిరాని లోకాలకు తరలిపోయారు! రక్తపోటు స్థాయులు అకస్మాత్తుగా పడిపోవడంతో మూడు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన రతన్‌ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి.. బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. తన ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో ఆందోళన వ్యక్తం కావడంతో.. ‘నేను బాగానే ఉన్నా.. ఆందోళన వద్దు’ అంటూ ప్రకటన చేసిన మూడురోజులకే ఆయన కన్నుమూశారు.

Ratan Tata No More..

టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాకు ముని మనవడైన రతన్‌ టాటా(Ratan Tata) 1937 డిసెంబరు 28న ముంబైలో జన్మించారు. తల్లిదండ్రులు సూని టాటా, నావల్‌ టాటా.. ఆయన పుట్టిన పదేళ్లకు విడిపోవడంతో, రతన్‌ టాటా తన నాయనమ్మ అయిన నవాజ్‌బాయ్‌ టాటా వద్ద పెరిగారు. ముంబై, సిమ్లాల్లో కొంతకాలం చదివిన అనంతరం.. ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అమెరికాలోని రివర్‌డేల్‌ కంట్రీ హైస్కూల్‌లో పట్టా పుచ్చుకున్న అనంతరం కార్నెల్‌ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌ అండ్‌ స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించారు. 1959లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న రతన్‌ టాటా(Ratan Tata).. 2008లో అదే కార్నెల్‌ యూనివర్సిటీకి 50 మిలియన్‌ డాలర్ల విరాళం ఇచ్చారు. ఆ విశ్వవిద్యాలయ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచారు. అమెరికాలో పట్టభద్రుడైన అనంతరం.. 1961లో ఆయన టాటా గ్రూపులో చేరారు. తొలుత టాటా స్టీల్‌లో చిరుద్యోగిగా చేరిన ఆయన గ్రూపులోని వివిధ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. 1971లో నేషనల్‌ రేడియో అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీ డైరెక్టర్‌ ఇన్‌చార్జిగా.. 1981లో టాటా ఇండస్ట్రీస్‌ చైర్మన్‌గా.. ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే విద్యార్థిలాగా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలోనే 1975లో అమెరికాలోని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ పూర్తిచేశారు. 1991లో జేఆర్‌డీ టాటా అనంతరం టాటా సన్స్‌ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టి.. 2012 డిసెంబరు 28వ తేదీన రిటైరయ్యేదాకా సంస్థను సమర్థంగా నడిపారు. ఆ తర్వాత మళ్లీ 2016 అక్టోబరు నుంచి 2017 ఫిబ్రవరి దాకా తాత్కాలిక చైర్మన్‌గా ఉన్నారు. 1991లో ఆయన పగ్గాలు చేపట్టే సమయానికి టాటా గ్రూప్‌లో ఉన్న కంపెనీల సంఖ్య దాదాపు 250 దాకా ఉండేది. కానీ, ఆయన వాటిని 98కి తగ్గించి సంస్థ సామర్థ్యాన్ని పెంచారు. టాటా గ్రూపు.. హై టెక్నాలజీ వ్యాపారాల్లో ప్రవేశించేందుకు బీజం వేశారు.

టాటా గ్రూప్‌ ఆయన హయాంలోనే 10 వేల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది. తన సమర్థ నాయకత్వంలో ఆయన టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, టీసీఎస్‌, టాటా పవర్‌, టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌, టాటా కెమికల్స్‌, ఇండియన్‌ హోటల్స్‌, టాటా టెలీ సర్వీసెస్‌ సంస్థలను అగ్రశ్రేణి సంస్థలుగా తీర్చిదిద్దారు. టీసీఎ్‌సను.. దేశంలో వెయ్యికోట్ల డాలర్ల వార్షిక ఆదాయం మైలురాయి దాటిన తొలి భారత ఐటీ కంపెనీగా నిలిపారు. వ్యాపారవేత్తగానే కాదు.. తన ఆదాయంలో 60 నుంచి 65 శాతం మేర వివిధ దాతృత్వ కార్యక్రమాలకు కోసం ఉదారంగా ఇచ్చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. భారత ప్రభుత్వం ఆయనను 2000 సంవత్సరంలో పద్మభూషణ్‌తో, 2008లో పద్మవిభూషణ్‌తో గౌరవించింది. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను, గౌరవ డాక్టరేట్లను రతన్‌ టాటా(Ratan Tata) అందుకున్నారు.

రతన్‌ టాటా హయాంలో టాటా గ్రూపు దేశ, విదేశాల్లో అనేక కొత్త వ్యాపారాల్లోకి విస్తరించింది. అన్నిటి కంటే ముఖ్యంగా ‘ఇండికా’ కారును దేశీయంగా అభివృద్ధి చేయడం ద్వారా, భారత ఆటోమొబైల్‌ కంపెనీలకు సొంతంగా కార్లను అభివృద్ధి చేసే సత్తా లేదన్న ప్రచారానికి ఆయన తెరదించారు. నానో కారు ద్వారా రతన్‌ టాటా(Ratan Tata) లక్ష రూపాయలకే మిడిల్‌ క్లాసుకు సొంత కారు భాగ్యం కల్పించారు. అలాగే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటిష్‌ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్‌, ల్యాండ్‌ రోవర్‌ను కొనుగోలు చేయడం ద్వారా, టాటా మోటార్స్‌ కంపెనీని అంతర్జాతీయ బ్రాండ్‌గా తీర్చి దిద్దారు. బ్రిటన్‌కు చెందిన టెట్లీ టీ బ్రాండ్‌ కొనుగోలు రతన్‌ టాటా హయాంలోనే జరిగింది. టాటా స్టీల్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని భారీగా విస్తరించడంతో పాటు, బ్రిటిష్‌ స్టీల్‌ కంపెనీని కొనుగోలు చేసి, టాటా స్టీల్‌ కంపెనీ కార్యకలాపాలను యూర్‌పకూ విస్తరించారు. ఆయన ప్రారంభించిన వ్యాపారాల్లో నానో కారు, టెలికం వెంచర్లు మాత్రమే అంతగా కలిసి రాలేదు.

తన తర్వాత టాటా గ్రూప్‌ను సమర్థుడైన వారసునికి అప్పగించాలన్న ఆలోచనతో సైరస్‌ మిస్త్రీని ఆ పదవికి ఎంపిక చేశారు. కాని వారి బంధం ఎంతో కాలం కొనసాగలేదు. ఆర్థికంగా కంపెనీకి గుది బండలా మారిన ‘నానో’ కారు ప్రాజెక్టు ఆపేయాలని మిస్త్రీ చేసిన ప్రయత్నాలకు రతన్‌ టాటా(Ratan Tata) అడుగడుగునా అడ్డుతగిలారు. తన మానస పుత్రిక అయిన నానో ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని రతన్‌ పట్టుబట్టడం వల్లే, మిస్త్రీ టాటా గ్రూప్‌కు దూరమయ్యారని చెబుతారు. టాటా గ్రూప్‌ చరిత్రలో మొదటిసారిగా పార్సీయేతర వ్యక్తి ఎన్‌ చంద్రశేఖరన్‌ టాటా గ్రూప్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం వెనక రతన్‌టాటా మద్దతు ఉంది.

50కి పైగా స్టార్ట్‌పల్లో పెట్టుబడులు

రతన్‌ టాటా సమర్థుడైన పారిశ్రామికవేత్త మాత్రమే కాదు.. తెలివైన పెట్టుబడిదారుడు కూడా. యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. వ్యక్తిగత హోదాలో ఆయన పేటీఎం, ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, స్నాప్‌డీల్‌, లెన్స్‌కార్ట్‌ సహా 50కి పైగా స్టార్ట్‌పల్లో ఆయన ఇన్వెస్ట్‌ చేశారు. అవన్నీ అద్భుత విజయాలు సాధించిన సంస్థలే!

ఎయిరిండియా కొనుగోలు

టాటా గ్రూప్‌ నుంచి ప్రభుత్వ పరమైన ఎయిరిండియాను మళ్లీ టాటాల పట్టులోకి తేవాలన్నది రతన్‌ టాటా(Ratan Tata) చిరకాల వాంఛ. ఇందుకు అడ్డంకులు ఎదురవడంతో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, మలేషియా ఎయిర్‌లైన్స్‌తో కలిసి విమానయాన రంగంలోకి ప్రవేశించారు. ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణకు అడ్డంకులు తొలగడంతో 2022లో ఆ సంస్థను మళ్లీ టాటా గ్రూప్‌ కొనుగోలు చేసింది. పీకల్లోతు నష్టాలతో ఉన్న ఎయిరిండియాను కొనేందుకు ఏ ప్రైవేటు సంస్థా ముందుకు రాలేదు. అయినా తమ గ్రూప్‌ వ్యవస్థాపకుడు జేఆర్‌డీ టాటా ప్రారంభించిన ఎయిర్‌ ఇండియాను మళ్లీ తమ పట్టులోకి తేవాలనే ఏకైక లక్ష్యంతోనే ఎయిర్‌ ఇండియాను రతన్‌ టాటా(Ratan Tata) కొనుగోలు చేశారు. ఇపుడు ఈ సంస్థ అన్ని బాలారిష్టాలను అధిగమిస్తూ పెద్ద ఎత్తున విస్తరణకు సిద్ధమైంది.

రతన్‌ టాటా విఫల ప్రేమగాథ!

వ్యాపార దిగ్గజంగా ఎన్నో విజయాలు సాధించిన రతన్‌ టాటా(Ratan Tata) కూడా ఎంతోమందిలా ఓ లవ్‌ ఫెయిల్యూరే.. 1962లో భారత్‌, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధం రతన్‌ టాటా ప్రేమ విఫలం కావడానికి కారణమైంది. రతన్‌ టాటా 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చదువు పూర్తి చేసుకుని అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ఓ ఆర్కిటెక్చర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో అక్కడి ఓ మహిళతో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఏడేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మతో కొద్ది రోజులు గడపడం కోసం ఆయన స్వదేశానికి వచ్చారు.

తన కోసం తన ప్రేయసి కూడా భారత్‌ వస్తుందని ఆశించారు. కానీ, భారత్‌- చైనా యుద్ధంతో ఆ మహిళ తల్లిదండ్రులు ఆమె భారత్‌ వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో వారి ప్రేమకథ ముగిసింది. ఈ తొలి ప్రేమ ఆయనకు ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది. తన ప్రేమకథను పలుమార్లు బయటపెట్టిన రతన్‌ టాటా(Ratan Tata) ఆ మహిళ ఎవరనేది ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత 1970ల్లో హిందీ చిత్రసీమలో ప్రముఖ నటీమణిగా వెలుగొందిన సిమీ గరేవాల్‌కు రతన్‌ దగ్గరయ్యారు. వారి అనుబంధం పెళ్లిపీటల వరకు వెళుతుందని ఆశించినా అది జరగలేదు. సిమీ మరొకరిని పెళ్లాడగా రతన్‌ టాటా ఒంటరయ్యారు. ఇలా మొత్తం నాలుగు సందర్భాల్లో ఆయన పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైనా వేర్వేరు కారణాలతో అవేవి జరగక ఆజన్మబ్రహ్మచారిగానే ఉండిపోయారు.

రతన్‌ టాటా మరణంతో ఈ సామ్రాజ్యం పగ్గాలు చేపట్టేందుకు అవకాశాలు, అర్హతలున్న టాటా కుటుంబ వారసుల జాబితాలో నోయెల్‌ టాటా పేరు ప్రధానంగా చెప్పుకోవాలి. రతన్‌ టాటా(Ratan Tata) సవతి సోదరుడు నోయల్‌ టాటా. గ్రూప్‌ రిటైల్‌ వర్తక విభాగమైన ట్రెంట్‌తోపాటు పలు వ్యాపారాల్లో ప్రస్తుతం ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. నోయెల్‌ సంతానమైన మాయ, నెవిల్లే, లేహ్‌ టాటా సైతం పలు టాటా కంపెనీల్లో మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

కారులో ప్రయాణించాలనే భారతీయ మధ్య తరగతి కుటుంబాల కల నెరవేర్చాలని దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా(Ratan Tata) సంకల్పించారు. ఆయన ఈ సంకల్పమే ‘నానో’ కారు రూపకల్పనకు దారితీసింది. ఈ కారును 2008లో మార్కెట్‌లోకి తెచ్చారు. కేవలం రూ. 1,00,000 ధరే నిర్ణయించి ప్రపంచంలోనే చౌకైన కారుగా ప్రకటించారు. ఇలా అప్పటికి ధనిక వర్గాలకే పరిమితం అయిన కారును మధ్య తరగతి ప్రజలకూ అందుబాటులోకి తెచ్చి వారి కల నెరవేర్చారు. ఈ కారు బయటకు వచ్చాక ఆరంభ కష్టాలు ఎదుర్కొన్నా… ఆటోమొబైల్‌ మార్కెట్లో సంచలనం సృష్టించింది. ఆటోమొబైల్‌ పరిశ్రమ కేవలం ఉన్నత వర్గాల కోసమే కార్లను తయారుచేయడం కాకుండా మధ్య తరగతి, దిగువ వర్గాలనూ దృష్టిలో ఉంచుకుని వాహనాలను తయారుచేయాలన్న చర్చకు దారితీసింది. ఈ విషయంలో రతన్‌ టాటా విజన్‌ స్పష్టంగా ఉంది… అదేమిటంటే మధ్య తరగతి స్థోమతకు తగ్గ కారును వారి ముందుంచడం… ‘నానో’తో ఆయన అది పూర్తిచేశారు.

Also Read : PM Narendra Modi : కాంగ్రెస్ దేశంలో కులాల వారీగా చూస్తుంది..సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని

Leave A Reply

Your Email Id will not be published!