PM Modi Tour : ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో కీలక అంశాలు ఇవే..
నైజీరియా తరువాత దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌లో మోదీ పర్యటించారు...
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన విజయవంతమైంది. ఆర్థిక, దౌత్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నవంబర్ 16 నుంచి 21 తేదీల్లో నైజీరియా, గయానా, బ్రెజిల్‌లో పర్యటించారు. ఐదు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో మోదీ ఆయా దేశాలతో భారత్ దౌత్య సంబంధాలు బలోపేతం చేసేందుకు కృషి చేశారు. నైజీరియా, గయానా దేశాలు ప్రధాని మోదీ(PM Modi)ని తమ అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించడంతో ఈ పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.తన విదేశీ పర్యటనతో భాగంగా ప్రధాని మోదీ తొలుత నైజీరియాకు వెళ్లారు. నైజీరియాతో మోదీ వాణిజ్యం, అభివృద్ధి, ఇతర రంగాలకు సంబంధించి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా నైజీరియా అధ్యక్షుడు ఆకాంక్షించారు. తమ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఇరు దేశాధినేతలు తిర్మానించారు.
PM Modi 5 Days tour…
నైజీరియా తరువాత దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌లో మోదీ(PM Modi) పర్యటించారు. ఈ క్రమంలో రియో నగరంలో ఏర్పాటు చేసిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా బ్రెజిల్ అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. బ్రెజిల్‌తో పాటు అర్జెంటీనా, పోర్చుగల్, యూకే, చిలీ దేశాధినేతలతో కూడా భారత ప్రధాని భేటీ అయ్యారు. వాణిజ్యం, సాంకేతిక రంగం, పర్యావరణం, ప్రజారోగ్యం తదితర అంశాలపై చర్చించారు. ఐక్యరాజ్య సమితి, ఐరోపా సమాఖ్య, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి అధిపతులతో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు.
చివరి గయానా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ మొత్తం 9 ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. గయానాతో పాటు ఇతర కరీబియన్ దేశాలతో భారత్‌కు చారిత్రిక, సాంస్కృతిక, వాణిజ్యం సంబంధాల బలోపేతం కోసం కృషి చేశారు. ముఖ్యంగా ఇంధన రంగం, విద్య, పర్యాటక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేందుకు బార్బడాస్, ట్రినిడాడ్ అండ్ దేశాలతో భారత్ పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. అంతర్జాతీయంగా భారత పరపతి పెంచే దిశగా ఆయా దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ప్రధాని మోదీ జరిపిన సమావేశాలు విజయవంతమయ్యాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడంలో భారత్ పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నదని ఐక్యరాజ్య సమితి, ప్రపంచఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి అధిపతులతో సమావేశాల సందర్భంగా మోదీ పేర్కొన్నారు.
Also Read : Mahesh Kumar : అదానీ వ్యవహారంపై కేటీఆర్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన టీపీసీసీ చీఫ్