Nijjar Killing : నిజ్జర్ హత్య ఘటనపై మీడియా కథనాలతో సంబంధం లేదంటున్న ట్రూడో సర్కార్
కెనడాకు చెందిన గ్లోబ్ అండ్ మెయిల్ తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది...
Nijjar Killing : ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య(Nijjar Killing) కేసులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును ప్రస్తావిస్తూ కెనడా మీడియా వెలువరించిన కథనంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ‘యూటర్న్’ తీసుకుంది. మీడియో కథనాన్ని తోసిపుచ్చింది. కెనడా ప్రభుత్వం అలాంటి అభియోగాలు చేయలేదని, అలాంటి సాక్ష్యాలు కూడా తమ వద్ద లేవని, గ్లోబ్ అండ్ మెయిల్ ప్రచురించిన నివేదికను తాము తోసిపుచ్చుతున్నామని పేర్కొంది.
Nijjar Killing…
కెనడాకు చెందిన గ్లోబ్ అండ్ మెయిల్ తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. ఇందులో పేరు చెప్పని కెనడా అధికారిని ఉటంకిస్తూ వార్తను పబ్లిష్ చేసింది. ”సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య(Nijjar Killing) కుట్ర గురించి నరేంద్ర మోదీకి తెలుసు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌కు కూడా తెలుసు” అని ఆ కథనం పేర్కొంది. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా మండిపడింది. కెనడా అర్ధంపర్ధం లేని ఆరోపణలు చేస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ ఖండించారు. సాధారణంగా తాము మీడియా కథనాలకు స్పందించమని, అయితే కెనడా ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ కథనం రావడంపై స్పందించాల్సి వచ్చిందని అన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలతో ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలను మరింత దారుణంగా దెబ్బతింటాయని హెచ్చరించింది.
కెనడా కథనంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది గంటలకే జస్టిన్ ట్రుడో ప్రభుత్వం స్పందించింది. మీడియా కథనం తమ ప్రభుత్వ స్పందన కాదని తెలిపింది. కేవల ఊహాగానాలు, తప్పుడు సమాచారంతో ఉన్న కథనమని పేర్కొంది. కెనడాలో సీరియస్ క్రిమినల్ కార్యకలాపాల్లో ప్రధాని మోదీ, జైశంకర్, దోవల్ ప్రమేయం ఉన్నట్టు తామెప్పుడూ చెప్పలేదని, అలాంటి సాక్ష్యాల గురించి కూడా తమకు తెలియదని వివరణ ఇచ్చింది. ఖలిస్థాన్ ఉద్యమంలో కీలక వ్యక్తి అయిన నిజ్జర్ 2023 జూన్‌లో కెనడాలో హత్యకు గురయ్యాడు. ఇది కెనడా-భారత్ మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. నిజ్జర్ హత్య కేసులో ఇండియా ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో పాటు భారత దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఇందుకు ప్రతిగా కెనడా దౌత్యవేత్తలను దేశం నుంచి భారత్ పంపించేసింది. భారత హైకమిషనర్ పేరును కూడా కెనడా ప్రస్తావించడం మరింత పెద్ద వివాదంగా మారింది.
Also Read : CM Chandrababu : గత జగన్ ప్రభుత్వం ఏపీ గౌరవాన్ని దెబ్బతీసింది