TS SSC Paper Leak Comment : లీకేజీల పర్వం ఇంకెంత కాలం
10వ తరగతి ప్రశ్నాపత్రం లీకు
TS SSC Paper Leak Comment : తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిన్నటి దాకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై కాస్తో కూస్తో నమ్మకం ఉండేది. చివరకు మొత్తం పరీక్షలను రద్దు చేసేంత దాకా వెళ్లింది.
ఇప్పటికే లీకేజీల వ్యవహారం దేశంలోనే (TS SSC Paper Leak Comment) సంచలనం కలిగించింది. ఈ స్కాం వెనుక ఎవరు ఉన్నారనేది ఇంకా తెలియ రాలేదు. ఇంతలోనే సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు 15 మందిని అదుపులోకి తీసుకుంది.
లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు , దీని వెనుక హవాలా మతలబు దాగి ఉందని అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వయంగా రంగంలోకి దిగింది.
ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తో పాటు సెక్రటరీ అనితా రామచంద్రన్ , ఇతర సభ్యులను విచారించింది. ఇది ఇలా కొనసాగుతుండగానే మరో వైపు ఊహించని రీతిలో వేలాది మంది భవితవ్యాన్ని నిర్ణయించే 10వ తరగతి పరీక్షలు(TS SSC) సోమవారం ప్రారంభమయ్యాయి.
వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రభుత్వ టీచర్ బందెప్ప ఏకంగా తెలుగు పేపర్ ను వాట్సాప్ ద్వారా బయటకు చేర వేయడం కలకలం రేపింది. మొదట విద్యా శాఖ బుకాయించింది. కానీ క్షణాల్లో వైరల్ కావడంతో గత్యంతరం లేక ఒప్పుకుంది. చివరకు సూపరింటెండెంట్ , ఇన్విజిలేటర్ తో పాటు టీచర్ ను కూడా సస్పెండ్ చేసింది.
షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని చావు కబురు చల్లగా చెప్పింది తెలంగాణ విద్యా శాఖ. రాష్ట్రంలో మద్యం దుకాణాల ఏర్పాటు, ఆదాయంపై ఉన్నంత శ్రద్ద విద్యా వ్యవస్థపై పెట్టడం లేదన్నది వాస్తవం. పాలనా పరంగా చోటు చేసుకున్న లొసుగులు ప్రశ్నా పత్రాల లీకేజీలకు కారణమవుతున్నాయని రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు.
నైతిక బాధ్యత వహించాల్సిన విద్యా శాఖ మంత్రి ఉన్నారో లేరో తెలియని పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న టీఎస్పీఎస్సీ వ్యవహారం జరిగినా ఇప్పటికీ ప్రభుత్వం కానీ విద్యా శాఖ కానీ మేలుకోక పోవడం దారుణం. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ 10వ తరగతి పరీక్షలపై ఆధారపడి ఉందన్నది విస్మరించడం బాధాకరం.
ఆరోగ్యం, విద్యా రంగాలను పూర్తిగా ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు, సంస్థలకు ధారదత్తం చేసిన ప్రభుత్వం రాబోయే పరీక్షలను సక్రమంగా నిర్వహిస్తుందన్న గ్యారెంటీ లేదు. చదువును అంగట్లో అమ్మకానికి పెట్టిన పాలకులకు విద్యార్థులు ఏమైపోతే ఏం. వాళ్లు బాగుంటే చాలు అన్న స్థితికి చేరుకుంది. ఇకనైనా విద్యార్థుల తల్లిదండ్రులు మేలుకోవాలి. లేక పోతే తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.
పాఠాలు చెప్పాల్సిన పంతులు, విద్యార్థులను సక్రమ మార్గంలో ఉంచడమే కాదు తాను ఆదర్శంగా ఉండాల్సింది పోయి చివరకు పేపర్ లీకు చేయడం క్షమించరాని నేరం. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇకనైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలి.
Also Read : ప్రభుత్వ వైఫల్యం విద్యార్థులకు శాపం