TTD laddu Controversy : తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన అప్డేట్..4 నిందితుల అరెస్ట్
ఉత్తరప్రదేశ్ కు చెందిన విపిన్ గుప్తా, పోమిల్ జైన్, అపూర్వ చావ్డా సిట్ అదుపులో ఉన్నారు...
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్తీ నెయ్యి కేసులో నలుగురు నెయ్యి సరఫరాదారులను సీబీఐ సిట్ టీమ్ ఆదివారంనాడు(09 ఫిబ్రవరి 2025) అదుపులోకి తీసుకుంది. తమిళనాడుకు చెందిన AR డైరీ ఏండీ రాజశేఖరన్‌తో పాటు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మూడు డైరీ కంపెనీల నిర్వాహకులను సిట్ అదుపులోకి తీసుకుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన విపిన్ గుప్తా, పోమిల్ జైన్, అపూర్వ చావ్డా సిట్ అదుపులో ఉన్నారు. ఈ నలుగురిని తిరుపతి కోర్డులో సోమవారం(10 ఫిబ్రవరి) హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
TTD Laddu Controversy Updates
సిట్ సభ్యుడు, సిబిఐ జాయింట్ డైరెక్టర్ విరేష్ ప్రభు తిరుపతిలో మకాం వేసి కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేశారు. గత మూడు రోజులుగా పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నారు. అయితే సిట్ విచారణకు సహకరించకపోవడంతో పాటు కల్తీ నెయ్యి వ్యవహారంలో వీరి ప్రమేయమున్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. టీటీడీ(TTD)తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నెయ్యి సరఫరాలో ఏఆర్ డైరీ పలు అక్రమాలకు పాల్పడినట్లు సిట్ నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఉత్తరాదికి చెందిన పలు డైరీ సంస్థల నుంచి ఏఆర్ డైరీ నెయ్యి కొనుగోలు చేసి.. టీటీడీకి సరఫరా చేసింది. ఏఆర్ డైరీతో పాటు ఆ సంస్థకు నెయ్యి సరఫరా చేసిన ఉత్తరాది డైరీ కంపెనీలకు చెందిన నిర్వాహకులను సిట్ ప్రశ్నిస్తోంది.
Also Read : GHMC Elections : తెలంగాణలో రోజురోజుకి హీటెక్కుతున్న మేయర్ ఎన్నికల పర్వం