TVK President Vijay: బీజేపీ భావజాల శత్రువు , డీఎంకే రాజకీయ విరోధి – టీవీకే అధినేత విజయ్‌

బీజేపీ భావజాల శత్రువు , డీఎంకే రాజకీయ విరోధి - టీవీకే అధినేత విజయ్‌

TVK President Vijay : తమ భావజాల శత్రువు బీజేపీ (BJP).. రాజకీయ విరోధి డీఎంకే (DMK) అని టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్‌ (Actor Vijay) పేర్కొన్నారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు, తమ పార్టీకి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపును తడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను ఉద్ధృతం చేసిన ఆయన… మదురైలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఈమేరకు ప్రసంగించారు. తనను ఎంత విమర్శిస్తే అంత ఎదుగుతానని వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విప్లవం సృష్టిస్తామన్నారు. తాను మధురై ఈస్ట్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

‘‘కులం కాదు.. మతం కాదు.. తమిళుడికే ప్రాధాన్యం ఇస్తాం. బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదు. మనుగడ కోసమే ఇతర పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. ఆరెస్సెస్‌ ముందు మనం ఎందుకు తలవంచాలి? తమిళ అస్తిత్వాన్ని ప్రతిపక్షాలు తగ్గిస్తున్నాయి. కచ్చతీవులకు శ్రీలంక నుంచి స్వేచ్ఛ కల్పిస్తాం. రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్‌ దిల్లీలో రహస్య సమావేశాలు జరుపుతున్నారు. ఆయన పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది’’ అని విజయ్‌ విమర్శలు గుప్పించారు. 2024 ఫిబ్రవరిలో టీవీకేను స్థాపించినప్పటినుంచి భారీ సభను నిర్వహించడం ఇది రెండోసారి. గతేడాది విల్లుపురం జిల్లాలోని విక్రవందిలో తొలి సభ నిర్వహించారు.

TVK President Vijay – పవర్‌ఫుల్‌ డైలాగ్‌ తో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన విజయ్‌

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోటీలో పొత్తు అంశంపై తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌ మరోసారి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని… టీవీకే సింగిల్‌గానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారాయన. గురువారం సాయంత్రం మధురై పరపతిలో జరిగిన మానాడు వేదికగా… నాలుగు లక్షల మంది అభిమానులు,పార్టీ కార్యకర్తల కోలాహలం నడుమ విజయ్‌ ప్రసంగించారు. అడవిలో సింహం అనేది ప్రత్యేకమైంది. అది గర్జిస్తే… ఎనిమిది కిలోమీటర్ల దాకా వినిపిస్తుంది. అలాంటి సింహమే వేటాడేది. అడవిలో గుంటనక్కలెన్నో ఉంటాయి. కానీ, సింహం ఒక్కటే ఉంటుంది. అదే అడవికి రారాజు. సింహం ఎప్పటికీ సింహమే. ఇదే మన డిక్లరేషన్‌ అని సింగిల్‌ పోటీని మరోసారి విజయ్‌ ధృవీకరించారు.

నా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. కానీ నేనేంటో మీకు బాగా తెలుసు. నేను వాటిని సీరియస్‌గా తీసుకోను. నేను తమిళనాడు ప్రజల మాట మాత్రమే వింటాను. చిన్న నవ్వుతో విమర్శలను పక్కన పెడతాను. మా స్వరం ఆపలేని స్వరం.. మా శక్తి ఆపలేని శక్తి. రాజకీయాల్లోకి రాక ముందు.. నేను రాజకీయాలకు రాలేనన్నారు. పార్టీ స్థాపించినప్పుడు, అది సరిపోదు, ప్రజలు ఓటు వేయరని అన్నారని విజయ్‌ గుర్తు చేసుకున్నారు. మదురైకి వచ్చినప్పుడు నాకు అలంగానల్లూరు జల్లికట్టు, మదురై మీనాక్షి అమ్మన్ గుర్తుకొస్తారు. ఈ గడ్డకు చెందిన కెప్టెన్ విజయకాంత్‌ తో అనేక అనుభవాలు నాకున్నాయి. 1967, 1977 ఎన్నికల ఫలితాలు 2026లో పునరావృతం అవుతాయి. టీవీకే ఆ చరిత్రను తిరిగి రాస్తుంది అని విజయ్‌ ధీమా వ్యక్తం చేశారు.

TVK President Vijay – విజయ్‌ టీవీకే సభలో తొక్కిసలాట ! పలువురి పరిస్థితి విషమం !

కోలీవుడ్‌ అగ్రనటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్‌ నిర్వహించిన బారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. మధురైలో గురువారం సాయంత్రం జరుగుతున్న ఈ సభకు సుమారు నాలుగు లక్షల మంది హాజరుకాగా… తొక్కిసలాటతో 400మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు మరణించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కగళం(టీవీకే) గురువారం మధురైలో నాలుగు లక్షలమందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మధురై జిల్లాలోని మధురై-తూత్తుకుడి హైవేలో పరపతిలో టీవీకే రెండవ రాష్ట్ర బహిరంగ సభ జరుగుతోంది. 501 ఎకరాల్లో సచివాలయం ఆకారంలో ఈ సభను ఏర్పాటు చేసింది.

Also Read : Justice B Sudershan Reddy: ఉప రాష్ట్రపతి పదవికి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

Leave A Reply

Your Email Id will not be published!