YS Sharmila : ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకం వైసీపీపై లేదు
మరోవైపు.. తన అన్న జగన్మోహన్‌రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మళ్లీ విరుచుకుపడ్డారు...
YS Sharmila : ఈ రాష్ట్రంలో క్రెడిబులిటి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు.. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇవాళ(సోమవారం) విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల(YS Sharmila) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… వైసీపీ, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చేతులెత్తేసిందని ఆ పార్టీకు క్రెడిబులిటి లేదని ప్రజలకు అర్థమైందని అన్నారు. వైసీపీపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబులిటితో వారి సమస్యలపై అనునిత్యం పోరాటాలు చేయాలని, వారిలో భరోసా నింపే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని అన్నారు. ప్రతి వారం రెండు సార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి క్యాడర్‌లో నూతన ఉత్తేజం నింపాలని, కార్యవర్గానికి సూచించినట్లు షర్మిల వెల్లడించారు.
YS Sharmila Slams
మరోవైపు.. తన అన్న జగన్మోహన్‌రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మళ్లీ విరుచుకుపడ్డారు. స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకు ఈడ్చిన విషనాగుగా ఆయన్ను అభివర్ణించారు. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానికి కారణమైన కాంగ్రెస్, చంద్రబాబుతో షర్మిల(YS Sharmila) చేతులు కలిపారని.. జగన్ మళ్లీ సీఎం కాకూడదని ఆమె కంకణం కట్టుకున్నారని ఎంపీ విజయసాయురెడ్డి ఆదివారం చేసిన వ్యాఖ్యలపై ఆమె ‘ఎక్స్’లో మండిపడ్డారు. రాజశేఖర్‌రెడ్డి మరణానికి చంద్రబాబే కారణమైతే.. ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గాడిదలు కాశారా అని ఆయన్ను నిలదీశారు. ‘ జగన్ ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయటపెట్టలేదు? దోషులను ఎందుకు శిక్షించలేదు? అనుమానం ఉండి.. ఐదేళ్లు అధికారంలో ఉండి.. ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదు? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా’ అని ధ్వజమెత్తారు.
రాజశేఖర్‌రెడ్డి మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదన్నారు. కాంగ్రె్‌సను ఆయన రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చారని.. బంగారు బాతును ఎవరూ చంపుకోరని.. సొంత కళ్లను ఎవరూ పొడుచుకోరని స్పష్టం చేశారు. వైఎస్ మరణం తర్వాత చార్జిషీటులో ఆయన పేరు చేర్పించింది జగన్ కాదా అని ప్రశ్నించారు. ‘ కేసుల నుంచి బయటపడేందుకు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి (సీనియర్ న్యాయవాది)తో కలసి ఈ కుట్ర చేయలేదా? కుట్ర చేయకపోతే జగన్ సీఎం అయిన వెంటనే అదనపు అడ్వకేట్ జనరల్ పదవి ఆయనకు ఎందుకిచ్చారు’ అని దుయ్యబట్టారు. జగన్‌కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడినట్లు లేదని అన్నారు. ‘ ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా.. బాబే కనిపిస్తున్నట్లుంది’ అని ఎద్దేవాచేశారు. బాబు కళ్లలో ఆనందం చూడడానికో.. ఆయన బ్రాండింగ్‌ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో పనిచేయాల్సిన అవసరం వైఎస్ బిడ్డకు ఎప్పటికీ రాదన్నారు.
Also Read : CM Revanth Reddy : తెలంగాణ సీఎం సెక్యూరిటీలో కీలక మార్పులు