YS Sharmila : బీజేపీ మత రాజకీయాల కోసం ఉగ్రదాడులను వాడుకుంటుంది
ఈ సదర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.....
YS Sharmila : భారత రాజ్యాంగ సంరక్షణ కోసం తమ పార్టీ నేతలు ఉద్యమిస్తున్నామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఏప్రిల్ 9వ తేదీన అహ్మదాబాద్లో కాంగ్రెస్ న్యాయపధ్పై నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఏపీలో ఈ న్యాయపధ్ ద్వారా వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. బీజేపీ సొంత రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ఏపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఇవాళ(శుక్రవారం) విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో షర్మిల(YS Sharmila), కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
YS Sharmila Viral Comments
ఈ సదర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ… అన్నివర్గాల వారికి సమాన న్యాయం చేయాలనేది కాంగ్రెస్ సిద్దాంతని ఉద్ఘాటించారు. 50 శాతం రిజర్వేషన్ ఎత్తి వేసి.. అవసరమైన మేరకు అమలు చేయాలని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంగా తాము ప్రజల్లోకి వెళ్తామని అన్నారు. ఉగ్రవాదుల దాడులను నియంత్రణ చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు చేశారు. పర్యాటకులు చనిపోతుంటే.. అక్కడ ఉన్న భద్రత దళాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అసలు దాడులు జరుగుతాయనే నిఘావర్గాల సమాచారం ఉందా లేదా అని ప్రశ్నించారు. పక్క దేశం వాళ్లు వచ్చి దాడులు చేస్తే అడ్డుకోలేరా అని షర్మిల నిలదీశారు.
మన దేశం మీద జరిగిన ఉగ్రవాద దాడే ఇదని షర్మిల చెప్పారు. మనమంతా కలిసి ఐక్యంగా ఎదుర్కొందామని అన్నారు. బీజేపీ మత రాజకీయాల కోసం ఉగ్రదాడి ఘటనను వాడుకుంటుందని.. ఇది చాలా బాధాకరమని చెప్పారు. అక్కడ ముస్లింలను కూడా చంపేశారని.. అది హిందువులపైన దాడిగా ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆ ప్రాంతం చాలా సురక్షితంగా ఉందని.. మోదీ బ్రాండ్ అంబాసిడర్గా ప్రచారం చేసుకున్నారని గుర్తుచేశారు. వారి మాటలు నమ్మి వెళ్లినందుకు అమాయకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మరి ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Also Read : Minister Kondapalli Srinivas : పాక్ లోని తెలుగు ప్రజలను వెనక్కి తిరిగి రావాలంటూ మంత్రి పిలుపు