YS Sharmila: వైఎస్ వివేకా వర్ధంతి సభలో షర్మిల సంచలన వ్యాఖ్యలు !
వైఎస్ వివేకా వర్ధంతి సభలో షర్మిల సంచలన వ్యాఖ్యలు !
YS Sharmila: మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానంద 5వ వర్ధంతి సభ వేదికగా ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేసారు. అన్నా అని పిలిపించుకున్న వాడే తన చిన్నాన్న వివేకానంద హత్య కేసులో హంతకులకు రక్షణగా మారాడని ఆరోపించారు. హంతకులను కాపాడటానికి చెల్లెళ్ళ మీద ఎన్ని అభాండాలు వేసినా తట్టుకున్నాం. హంతకులకు కాపాడుతూ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ వివేకానంద 5వ వర్ధంతి సందర్భంగా పులివెందులలో అతని సమాధికి నివాళి అర్పించారు. అనంతరం కడపలో నిర్వహించిన 5వ వర్ధంతి సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఇది ఆస్తికోసం అంతస్తు కోసం జరిగే పోరాటం కాదని… న్యాయం కోసం చేస్తున్న పోరాటమని ఆమె స్పష్టం చేసారు. ఈ సందర్భంగా సునీత చేస్తున్న న్యాయ పోరాటనికి, ధర్మ పోరాటానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
YS Sharmila Comments Viral
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల(YS Sharmila)… తన చిన్నాన్న వివేకాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం సభలో షర్మిల మాట్లాడుతూ… వైఎస్ వివేకా ఒక మంచి మనిషి. వివేకా ది అద్భుతమైన వ్యక్తిత్వం. అందరికీ సహాయపడే గుణం. నన్ను ఎత్తుకొని తిరిగిన వ్యక్తి మా చిన్నాన్న వివేకానంద. చిన్నాన్నకు ఎప్పుడు చికాకు పడలేదు… కోపం రాదు. ఎవరైనా సహాయం అని అడిగితే… వెంట పెట్టుకొని మరి తీసుకొని వెళ్ళి… సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా ఉండేవాడు. చిన్నాన్న చనిపోయి 5 ఏళ్లు గడించింది. ఇప్పటికీ చిన్నాన్న మరణం నమ్మలేని నిజం. రాజకీయ విష సర్పాల కోరల్లో చిక్కుకుని… దుర్మార్గపు పాలన చక్రాల కింద నలిగిపోయారు. క్రూరాతి క్రూరంగా చిన్నాన్నను హత్య చేశారు. కాని నిందితులకు ఈనాటికీ శిక్ష పడలేదు. అంతటి వ్యక్తికే న్యాయం జరగలేదు అంటే… సమాజంలో మిగతా వారి పరిస్థితి ఎంటి ? అని ప్రశ్నించారు.
చిన్నాన్న హార్ట్ ఎటాక్ తో చనిపోయారు అని చెప్పారు. సాక్షి కూడా ఇదే విధంగా కవరేజ్ ఇచ్చింది. కాని ఇక్కడకు వస్తేగాని అసలు విషయం తెలియలేదు. బంధువులే హత్య చేశారు అని అందరికీ తెలుసు. ఎవరు చేశారో అందరికీ తెలుసు. వేలు ఎత్తి వీళ్ళే అని చూపుతున్నా చర్యలు లేవు. కేసు ముందడుగు పడలేదు. ఆన్న అని పిలిపించుకున్న వాడే హంతులకు రక్షణ గా ఉన్నాడు. అందుకే ఇవ్వాళ్టి వరకు చిన్నాన్న విషయంలో న్యాయం జరగలేదు. వివేకా హత్యతో సునీత, సౌభాగ్యమ్మ ఇద్దరికీ నష్టం జరిగింది. న్యాయం చేయాల్సింది పోయి తిరిగి సునీత హత్య చేసింది అని చెప్తున్నారు.
మీరు ఒకసారి అద్దం ముందు నిలబడండి. మీ మనస్సాక్షి ఏం చెప్తుంది చూడండి. సాక్షిలో పైన వైఎస్సార్ ఫోటో… కింద సాక్షిలో వివేకా క్యారెక్టర్ మీద నిందలు. చనిపోయే వరకు మీకే సేవ చేశారు. మీకోసమే ఎన్నికలో పని చేశారు. మీకోసం పని చేస్తే నిందలు వేస్తారా ? సోషల్ మీడియాలో బెదిరించారు. బూతులు తిట్టారు. తోడబుట్టిన చెల్లెల్లు అని చూడకుండా అవమానాలకు గురి చేశారు. అన్నింటికీ తట్టుకున్నాం. సునీత కు..చిన్నమ్మ కి మాట ఇస్తున్న… ఎవరు ఉన్నా లేకున్నా…వైఎస్సార్ బిడ్డ మీకు అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు.
Also Read : EC : కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎన్నికల కమిషనర్ ల నియామకంపై కీలక ఆదేశాలు