YS Sharmila: కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల !
కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల !
YS Sharmila: ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖరారు చేసింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ మేరకు అభ్యర్థుల జాబితాకు తుది రూపు తీసుకొచ్చినట్లు సమాచారం. సీఈసీ భేటీకి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు ముఖ్యనేతలు హాజరయ్యారు. 117 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులుగా పలువురి పేర్లకు ఆ పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల అభ్యర్థులను పెండింగ్లో ఉంచినట్లు సమాచారం.
YS Sharmila Participation
కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల(YS Sharmila), రాజమహేంద్రవరం నుంచి గిడుగు రుద్రరాజు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. వీరితో పాటు సత్యారెడ్డి (విశాఖపట్నం), పళ్లంరాజు (కాకినాడ), జేడీ శీలం (బాపట్ల) అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు తెలిసింది. పెండింగ్లో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకి పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది.
షర్మిల కడప నుంచి పోటీ చేస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది కానీ అధికారిక ప్రకటన రాలేదు. అయితే సీఈసీ మీటింగ్ తరువాత షర్మిల పోటీ చేస్తారని అధికారికంగా తెలియడంతో హాట్ టాపిక్ అయిపోయింది. కడప అంటే సీఎం జగన్ సొంత ఇలాఖా.. అక్కడి నుంచి గత ఎన్నికల్లో ఆయన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి కూడా ఆయనే బరిలోకి దిగనున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, సీఎం జగన్ స్వయానా సోదరి వైఎస్ షర్మిల బరిలోకి దిగనుండటంతో కడప ప్రజలు ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : Botsa Satyanarayana : టీడీపీ నాయకులు ఏపీ ప్రజల్ని ప్రత్యేకంగా ఫుల్ ని చేస్తున్నారు..