YS Sharmila : మాజీ సీఎం జగన్ పై ఘాటు విమర్శలు చేసిన షర్మిల

అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనమని షర్మిల మండిపడ్డారు...

YS Sharmila : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆయన సొంత చెల్లెలు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి పోని జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘ సిగ్గు సిగ్గు!! మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు! . ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు జగన్ మోహన్ రెడ్డి గారు. కానీ మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది’’ అంటూ ఓ రేంజ్‌లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు.

YS Sharmila Comment

అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనమని షర్మిల మండిపడ్డారు. ‘ MLA stands for Member of the Legislative Assembly, not Member of the Media Assembly. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా? అని జగన్‌ను షర్మిల(YS Sharmila) ప్రశ్నించారు. ‘‘ ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడి. రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారు. నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపిగా ప్యాలస్‌లో కూర్చుని మీడియా మీట్‌లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసింది’’ అంటూ విమర్శలు గుప్పించారు.

గత మీ పాలనపై విమర్శలకు, అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా అని షర్మిల(YS Sharmila) నిలదీశారు. ‘‘ ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్‌లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా?. అసెంబ్లీకి పోనని చెప్పే మీరు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు. వెంటనే రాజీనామా చేయండి!!. బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకే పోతారో ఎవడికి కావాలి అప్పుడు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది’’ అని తీవ్రంగా విమర్శించారు.

Also Read : Israel : ఇజ్రాయెల్ గోలన్ హైట్స్ ప్రాంతంలో ‘హిజ్బుల్లా’ దాడికి 11 మంది పిల్లలు మృతి

Leave A Reply

Your Email Id will not be published!