YS Sharmila: కంటతడి పెట్టిన ఏపీపీసీసీ వైఎస్ షర్మిల !

కంటతడి పెట్టిన ఏపీపీసీసీ వైఎస్ షర్మిల !

YS Sharmila: రాజకీయ, డబ్బు ఆకాంక్షతోనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిందని ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీపీసీసీ వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నన్ను రాజకీయాల్లోనికి తెచ్చింది జగనన్న కాదా ? జైల్లో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమన్నది జగన్ కాదా? నా భర్త, పిల్లల్ని వదిలేసి జగనన్న కోసం వేల కి.మీల మేర పాదయాత్ర చేశా. జగన్ రాజకీయ భవిష్యత్‌ కోసం నా కాలికి గాయమైనా వెనక్కి తగ్గలేదు. పాదయాత్ర సమయంలో వైసీపీ అంతా నా చుట్టే తిరిగింది. నాకే రాజకీయ కాంక్ష ఉంటే వైసీపీను ఆరోజే నేను హైజాక్‌ చేసేదాన్ని ? మీ నుంచి పైసా సాయం కోరినట్టయినా నిరూపించగలరా? మీరు వైఎస్‌ఆర్‌ కొడుకునని ఎందుకు మర్చిపోతున్నారు? ప్రపంచంలో రాజకీయ విబేధాలు ఉన్నవాళ్లు చాలా మంది ఒకే కుటుంబంలో ఉన్నారు. వేర్వేరు పార్టీలో ఉండి ఒకే కుటుంబంలో కొనసాగుతున్నవారు చాలా మంది ఉన్నారు. కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో షర్మిల(YS Sharmila) మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు.

‘‘ఆనాడు ప్రతి సభలో, ప్రతి అడుగులో జగన్‌ కోసం కాలికి బలపం కట్టుకొని నేను తిరగలేదా? ఇన్ని త్యాగాలు చేసినా నాకు రాజకీయ కాంక్ష ఉందంటున్నారే.. అదే ఉంటే నేను పొందాలనుకున్న పదవి మీ పార్టీలో మొండిగానైనా పొందగలను. వివేకానందరెడ్డి లాంటి వారు నాకు అండగా నిలబడ్డారు… నన్ను ఎంపీగా చేయాలని ప్రయత్నించిన ఎంతో మంది మీ పార్టీలోనే ఉన్నారు. అందరి అండ చూసుకొని ఏ రోజైనా అలా వ్యవహరించానా? నాకు రాజకీయ కాంక్ష గానీ, డబ్బు కాంక్ష గానీ ఉందని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా? మీరు సీఎం అయ్యేంత వరకు అన్న కోసమని, రాజశేఖర్‌ రెడ్డి చేసిన సంక్షేమ పాలన మీరు మళ్లీ తీసుకొస్తారని నమ్మి నేను మీకోసం ఎంతో చేసిన విషయం వాస్తవం కాదా?

మనిద్దరం నమ్మే బైబిల్‌ మీద ఒట్టేసి నేను చెప్పగలను… నాకు రాజకీయ కాంక్ష గానీ, డబ్బు కాంక్షగానీ, మిమ్మల్ని పదవి అడగకుండా మీ కోసం నిస్వార్థంగా పనిచేశానని నేను ప్రమాణం చేయగలను. మిమ్మల్ని పదవి అడిగానని మీరు అదే బైబిల్‌పై ప్రమాణం చేయగలరా? నాకు రాజకీయ కాంక్ష ఉందని, డబ్బు కాంక్ష ఉందని గానీ రుజువు చేయగలరా? అసలు మనిషిని, మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్‌ రెడ్డి నుంచి మీకు ఎందుకు రాలేదు? ఏదైనా ఒక లావాదేవీ కోసం, లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు ఆయన. అలాంటి వ్యక్తి బిడ్డని నేను. ఆయన హృదయానికి దగ్గరగా, ఆయన మాటలు వింటూ హృదయంలో హృదయంలా పెరిగాను. ఆయన ఆశయాల కోసం ఆ రకంగానే మీకు సహాయపడాలని నేను నిస్వార్థంగా త్యాగం చేశాను’’ అంటూ షర్మిల కన్నీరు పెట్టుకున్నారు.

YS Sharmila – ఆ మాత్రం ఇంగితం లేకుండా నాపై దుష్ప్రచారమా ?

‘‘జగన్‌(YS Jagan) సోషల్‌ మీడియా ద్వారా నాపై దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు. రాజన్న బిడ్డనన్న ఇంగితం లేకుండా నాపై, నా పుట్టుకపై రాక్షస సైన్యంతో ప్రచారం చేయిస్తున్నారు. నాపై వికృతంగా ప్రచారం చేయించినందుకు జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు. మీ కోసం త్యాగం చేసిన చెల్లిని గౌరవించకపోగా మానసికంగా హింసిస్తారా? జగన్‌ కు చంద్రబాబు పిచ్చిపట్టుకుంది… అందుకే భ్రమల్లో బతుకుతున్నారు. జగన్‌(YS Jagan) మానసిక పరిస్థితిపై నాకు నిజంగానే ఆందోళన ఉంది. మాట మాట్లాడితే నేను, సునీత చంద్రబాబు చేతిలో రిమోట్‌ కంట్రోల్‌ అని, ఆయన చెప్పినట్లు చేస్తున్నామని అంటున్నారు. జగన్‌ వి అన్నీ ఊహజనితమైన ఆరోపణలు. మేం చంద్రబాబు చేతిలో రిమోట్‌ కంట్రోల్‌ అనడంలో అర్థంలేదు. ఆయనకు అందరూ కీలు బొమ్మల్లాగే కనిపిస్తారు. మీకు ఎలా వీలైతే అలా మాట్లాడతారా? వివేకా హత్య విషయంలో తొలుత సీబీఐ విచారణ అడిగారు. సీఎం అయ్యాక వద్దన్నారు. ఇదేనా మీకున్న విలువ? అవసరానికి మాట మారుస్తారా? మీకు విలువ అనేది ఉంటే.. వైఎస్‌ఆర్‌ పేరును ఛార్జ్‌షీట్‌లో పెట్టించిన వాళ్లకు ఎలా పదవులు ఇస్తారు?’’ అని ప్రశ్నించారు.

దొంగ ఎప్పుడైనా దొంగనని చెబుతాడా?

‘‘మీ పేపర్‌లో వైఎస్‌ఆర్‌ ఫొటో.. కింద వివేకాపై తప్పుడు ప్రచారం.. ఇదేనా మీ విలువ? సొంత బాబాయి మీద తప్పుడు ప్రచారం చేస్తారు. ఇదేనా మీకున్న విశ్వసనీయత? మీకు విలువ ఉంటే అవినాష్ రెడ్డి మీద అనుమానం ఎందుకు రాలేదు ? అవినాష్ రెడ్డి నిర్దోషి అని నాలుగు ఇంటర్వ్యూల్లో చెబితే చూసి మీరు కన్విన్స్ అయ్యారా? అలా కన్విన్స్‌ అవ్వడానికి మీరెవరు? రాజ్యాంగమా? చట్టమా? కన్విన్స్ అవ్వాల్సింది న్యాయ వ్యవస్థ. సీబీఐ వద్ద ఆధారాలు ఉన్నాయి.. నిర్దోషులైతే సీబీఐకి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? దొంగ ఎప్పుడైనా దొంగనని చెబుతాడా? దొంగ మాటలు పిచ్చోళ్లు నమ్ముతారు. మీకు విశ్వసనీయత ఉంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు ? పోలవరం ఎందుకు కట్టలేదు ? కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఎందుకు కట్టలేదు? కడపలో 620 గ్రామాలకు కనీసం త్రాగునీరు లేదెందుకు? వైఎస్‌ఆర్‌ తర్వాత ఒక్క ఎకరాకు సాగు నీరు ఇవ్వలేదు’’ అని షర్మిల(YS Sharmila) జగన్‌ను నిలదీశారు.

Also Read : Amanchi Krishna Mohan: చీరాల డీఎస్పీని చెట్టుకు కట్టేస్తాం – చీరాల కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి

Leave A Reply

Your Email Id will not be published!