YS Sharmila Strong Counter to CM Jagan: సీఎం జగన్ పై షర్మిల షాకింగ్ కామెంట్స్ !
సీఎం జగన్ పై షర్మిల షాకింగ్ కామెంట్స్ !
YS Sharmila: కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని విడగొట్టి రాజకీయాలు చేస్తోందంటూ బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై అతని సోదరి, ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) గట్టి కౌంటర్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడలో పార్టీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘‘కాంగ్రెస్ పార్టీ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నా జగన్ అన్న. అంతేకాదు దేవుడే గుణపాఠం చెప్తారని అన్నారు. నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే కారణం మా జగనన్నే. ఇవాళ వైఎస్సార్ కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది మా జగనన్నే. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి, వైఎస్సార్ భార్య విజయమ్మ. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందిలో ఉంటే 18 మంది రాజీనామాలు చేసి జగన్ అన్న వైపు నిలబడితే అధికారంలో వచ్చాక మంత్రులను చేస్తా అన్నారు. ఇవాళ వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు ? అని ఆమె ప్రశ్నించారు.
వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని, పిల్లలకు పక్కన పెట్టి ఎండనకా, వాననకా రోడ్ల మీదనే ఉన్నా. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కాదా అని ఆ యాత్ర కూడా చేశా. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేయమంటే చేశా. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా. ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూడకుండా, నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా. గత ఎన్నికల్లో ‘బై బై బాబు’ అంటూ ఊరూరా తిరిగా. దేశంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ క్యాంపెయిన్ చేశా. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి వేరే మనిషిగా మారిపోయాడు.
నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నాను. మంచి ముఖ్యమంత్రి అయితే చాలు… వైఎస్సార్ పేరు, ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నాను. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. అయినా ఏపీలో బీజేపీ రాజ్యం ఏలుతోంది. జగన్ ఆయన పార్టీని, రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు. ప్రత్యేక హోదా అడగకుండా బానిస అయ్యారు. 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా హోదా అడగలేదు. రాష్ట్రంలో ఇప్పుడు హోదా అన్న అంశమే లేదు’’ అంటూ తనదైన శైలిలో జగన్‌పై షర్మిల(YS Sharmila) విరుచుకుపడ్డారు.
YS Sharmila – మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు ?
‘‘వైఎస్సార్ పనితీరు మీలో కన్పిస్తే మీరు వైఎస్సార్(YSR) వారసులు అవుతారు. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయం దండగ. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం ఒక పండుగ. వైఎస్సార్ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ఇది రైతు రాజ్యం కాదు. వైఎస్సార్ సుపరిపాలన అంతకన్నా కాదు. ఉద్యోగాలు లేవు.. నోటిఫికేషన్లు ఇవ్వరు. 30 వేల టీచర్ ఉద్యోగ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా నోటిఫికేషన్ లేదు. వైఎస్సార్ ప్రజల మనిషి. ప్రజల మధ్యే బ్రతికాడు. ఇప్పుడు జగన్ ఒక నియంత. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడు. ప్రజలకు కనపడరు.. ఎమ్మెల్యేలను కలవరు. మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు .? వైఎస్సార్ నష్టపోతున్న కంపెనీలను ప్రభుత్వ పరం చేయించారు. మీరు ఉన్న ఆస్తులను అమ్ముతున్నారు. వైఎస్సార్ పేరును చెడగొట్టింది మీరు.. ఎంతో మంది త్యాగాలు చేస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. నా అనుకున్న వాళ్ళను అందరినీ దూరం చేశారు. వైఎస్సార్ పాలనకు జగన్ అన్న పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది’’ అని ఆమె ఆరోపించారు.
ఎంతో మంది త్యాగాలు చేస్తే జగన్ సీఎం అయ్యారు !
సీఎం ప్రజల వద్దకు వెళ్లరు.. వాళ్లు వచ్చినా కలవనీయరు. కనీసం ఎమ్మెల్యేలకు కూడా జగన్ కనపడరు. వైఎస్‌ను కలవాలంటే ప్రజాదర్బార్‌లో నేరుగా కలిసేవాళ్లు. ఎంతోమంది ఆస్తులు అమ్ముకొని త్యాగాలు చేస్తే జగన్ సీఎం అయ్యారు. అప్పటి నుంచి అందరినీ దూరం చేసుకున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుండటం చూసి చలించిపోయా. నా కుటుంబం చీలిపోతుందని తెలిసినా ప్రజల కోసం కాంగ్రెస్‌లో చేరా. అద్భుత రాజధాని కావాలనేది మా పార్టీ ఉద్దేశం. కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపై రాహుల్‌గాంధీ తొలి సంతకం చేస్తారు’’ అని షర్మిల(YS Sharmila) అన్నారు.
అన్నీ తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నా !
‘‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు సోనియా గాంధీని కలిశా. వాళ్ళు వైఎస్సార్‌పై పెట్టుకున్న ప్రేమ అభిమానాన్ని చూశా. వైఎస్సార్ ఉంటే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నారు. వైఎస్సార్ కుటుంబంలో జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత నేను కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు ఒప్పుకున్న. నాన్న నాకు నేర్పించింది ప్రజల మధ్య ఉండాలని. నన్ను కాంగ్రెస్ ఏపీకి వెళ్ళమంటే పని చేయాలని నిర్ణయించుకున్నా. ఇక్కడ బీజేపీ చేస్తున్న తెర వెనుక రాజకీయాలను తెలుసుకున్న. ప్రజలకు జరుగుతుంది అన్యాయం కాబట్టి… నేను ఇక్కడ పని చేయాలని అనుకున్న. ఇది వ్యక్తిగత నిర్ణయం కానే కాదు. నా వ్యక్తిగత నిర్ణయం… నేను 2019లోనే తీసుకున్న. ఈ నిర్ణయంతో నేను టార్గెట్ అవుతా అని తెలుసు. నన్ను ఎటాక్ చేస్తారని తెలుసు. నా కుటుంబం నిట్ట నిలువునా చీలుతుంది అని తెలుసు. అయినా నేను తీసుకున్న నిర్ణయం ప్రజల కోసమే’’ అంటూ షర్మిల(YS Sharmila) పేర్కొన్నారు.
Also Read : Governer Appoints New MLCs: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ !