YSRCP 4th List: త్వరలో వైసీపీ నాలుగో జాబితా ? టెన్షన్ లో నేతలు ?
త్వరలో వైసీపీ నాలుగో జాబితా ? టెన్షన్ లో నేతలు ?
YSRCP 4th List: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ అధిష్టానం విడుదల చేస్తున్న నియోజకవర్గ ఇన్ చార్జిల జాబితా… అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటివరకు మూడు జాబితాలు విడుదల చేసిన వైసీపీ అధిష్టానం… 59 మంది ఇన్ చార్జిలను ప్రకటించగా… అందులో 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చింది. దీనితో ఇంకా ఎంతమందికి స్థాన చలనం లేదా… మొండి చెయ్యి చూపిస్తోందో తెలియక సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జీలు, ఆశావాహులు టెన్షన్ పడుతున్నారు. సీటు దక్కించుకున్న వారు సీఎం, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతుండగా, సీటు కోల్పోయిన వారు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే తరువాత విడుదల చేయబోయే జాబితాలో తమ పేర్లు ఉంటాయో… ఊడుతాయో… తెలియక మరికొంత మంది తాడేపల్లికి క్యూ కడుతున్నారు.
YSRCP 4th List Updates
ఈ నెల 25 నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటన ఖరారు చేయడం… రోజుకు రెండు సభలు చొప్పున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో… సంక్రాంతి వెళ్ళిన వెంటనే వైసీపీ(YSRCP) అధిష్టానం నాలుగో జాబితా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందని సమాచారం. దీనితో సిట్టింగ్ లు, ఇన్ చార్జిలు, ఆశావాహులు అని తేడా లేకుండా ఎవరికి వారు… పార్టీ పెద్దలతో లాబీయింగ్ మొదలు పెట్టేశారు. అదే సమయంలో తమకు సీటు రాకపోయినా, తగిన హామీ దొరక్కపోయినా ఏం చేయాలి అనే దానిపై ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పర్చూరు నియోజకవర్గ ఇన్ ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. చీరాల నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన… తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ… అధిష్టానం మాత్రం ఆయన్ను పర్చూరు ఇన్‌ఛార్జిగా నియమించింది. దీంతో అప్పటినుంచి అసంతృప్తితో ఉన్న కృష్ణమోహన్… తిరిగి చీరాల వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఈ క్రమంలోనే ఆయన తాడేపల్లికి వచ్చి పార్టీ పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం… ఆ తరువాత వైసీపీకు(YSRCP) మద్దతిచ్చారు. దీనితో చీరాల ఇన్‌ఛార్జిగా ఆయన కుమారుడు కరణం వెంకటేశ్‌ను వైసీపీ ప్రకటించింది. అయితే ఇప్పుడు చీరాల సీటు కోసం ఆమంచి కూడా పట్టుబట్టడం వైసీపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.
మరోవైపు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి గత రెండు రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సర్వే రిపోర్టులు గంగులకు అనుకూలంగా లేవని, ఈ స్థానంలో మార్పులు చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రిజేంద్ర స్థానంలో ఆయన తండ్రి గంగుల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు కూడా తాడేపల్లి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ముఖ్యనేతలను కలవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Also Read : Vundavalli Arun Kumar: ఉండవల్లితో షర్మిల భర్త బ్రదర్ అనిల్ భేటీ ! కారణం అదే ?