YSRCP Leaders: వెన్నుపోటు దినం పోస్టర్‌ ఆవిష్కరించిన వైసీపీ నేతలు

వెన్నుపోటు దినం పోస్టర్‌ ఆవిష్కరించిన వైసీపీ నేతలు

YSRCP Leaders : టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి జూన్ 4వ తేదీకు సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ… తమ ఏడాది పాలనపై ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ… ప్రతిపక్ష వైసీపీ(YSRCP) మాత్రం జూన్ 4 ను వెన్నుపోటు దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతామని ప్రకటించింది. సూపర్ సిక్స్ పేరుతో అబద్దపు హామీలతో అధికారం చేపట్టి ఏడాదిలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని… రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తూ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ ఈ వెన్నుపోటు దినోత్సవం జరపడానికి ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వెన్నుపోటు దినోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నాయకులు ఆవిష్కరించారు.

YSRCP Leaders Release

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ(YSRCP) రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ఒక దుర్మార్గమైన పాలనను దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నామని అన్నారు. ఈ వంచనను ప్రశ్నిస్తూ వైఎస్సార్‌సీపీ తలపెట్టిన వెన్నపోటు దినం నిరసనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందన్నారు.

రాష్ట్రంలో చంద్రబాబు(CM Chandrababu) నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ, అరాచక విధానాలను పరిచయం చేసింది. కూటమి పార్టీలు మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి జూన్ 4వ తేదీకి ఏడాది అవుతోంది. ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, అడ్డంగా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దానిని ప్రశ్నించకుండా రాష్ట్రంలో ప్రభుత్వమే భయోత్పాతాన్ని సృష్టించిన చరిత్ర కూడా ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు.

అధికారంలో వచ్చిన తొలి రోజు నుంచే ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ, ఏడాదిలోనే తొంబై తొమ్మిదిశాతం అమలు చేసిన ఘనత వైయస్ జగన్‌(YS Jagan) ది. అలాగే విప్లవాత్మక వ్యవస్థలను సృష్టించి, ఆచరణలోకి తీసుకువచ్చి, ప్రజల వద్దకే సుపరిపాలనను తీసుకువెళ్ళి అందించి చరిత్ర సృష్టించారు. దానికి భిన్నంగా ఆ వ్యవస్థలను విధ్వంసం చేస్తూ, అరాచక పాలనను ఏడాదిలోనే చంద్రబాబు ప్రజలకు చవిచూపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి దారుణాలకు పాల్పడవచ్చో కూడా చంద్రబాబు నిరూపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఆనాడే వైఎస్‌ జగన్ స్పందిస్తూ, వాటిని అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదని, ప్రజలను మోసం చేయడానికే ఇటువంటి హామీలు ఇస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పారు.

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం చాలా కష్టమని చెబుతున్నారు. సంపద సృష్టిస్తానని, పేదల బతుకుల్లో వెలుగులు తీసుకువస్తానంటూ మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు పీ-4 అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. పేదరికాన్ని నిర్మూలించే బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి మోసం బహుశా ఎక్కడా మనకు కనిపించదు. 1995లో సొంత మామనే వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తరువాత 1999, 2014, 2024లోనూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. గతంలొ హామీలను అమలు చేస్తానంటూ అబద్దాలు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు బరితెగించి, హామీలను అమలు చేయడం కుదరదంటూ అడ్డంగా మాట్లాడుతున్నాడు.

YSRCP Leaders- రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం ర్యాలీలు

చంద్రబాబు సీఎంగా తొలి ఏడాదిలోనే రూ.1.49 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆ సొమ్ము దేనికి వినియోగించారో తెలియదు. ఆనాడు తన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిస్తే, ఈ రోజు నేరుగా తనను నమ్మి ఓటు వేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచారు. దీనిని ప్రశ్నిస్తూ వైయస్ఆర్‌సీపీ వెన్నుపోటుదినంను నిర్వహిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు ర్యాలీలుగా వెళ్ళి స్థానికంగా ఉన్న అధికారులకు మెమోరాండంలు సమర్పిస్తాయి. ఎన్నికల హామీలను అమలు చేయాలని, ఈ ఏడాది కాలంగా ప్రజలకు ఇస్తామన్న అన్ని పథకాల లబ్ధిని దానిని తక్షణం విడుదల చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు మోసపోయిన ప్రజలు కూడా పాల్గొని, ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Also Read : Minister Nimmala Ramanaidu: బుడమేరు సీసీ వాల్‌ పనుల జాప్యంపై మంత్రి నిమ్మల ఆగ్రహం

Leave A Reply

Your Email Id will not be published!