MP Midhun Reddy : మాజీ సీఎం జగన్ కు సెక్యూరిటీ కల్పించాలంటూ కేంద్రానికి లేఖ రాసిన ఎంపీ
మాజీ సీఎంగా జగన్‌కు జెడ్‌ప్లస్ సెక్యూరిటీ వర్తిస్తుందని అన్నారు బొత్స...
Midhun Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పంచాయితీ మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గించారని వైసీపీ ఆరోపిస్తుంటే.. ఎన్నికల కోడ్ ఉందనే విషయం కూడా వైసీపీ అధినేతకు తెలియదా? అని అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. ఇప్పటికే జగన్‌కు ప్రతిపక్ష హోదాపై కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వైసీపీ.. ఇప్పుడు భద్రత అంశంపైనా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.
MP Midhun Reddy Write a Letter..
మాజీ సీఎం జగన్(YS Jagan) గుంటూరు మిర్చి యార్డు పర్యటన సందర్భంగా ఆయనకు భద్రత తగ్గించారనే అంశంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది వైసీపీ. మిర్చి రైతుల పరామర్శ సమయంలో జగన్‌కు పోలీస్ భద్రత కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం అయిందని ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం కావాలనే జగన్(YS Jagan)ను ఇబ్బంది పెడుతోందని, ఈ క్రమంలోనే జగన్‌కు భద్రత కల్పించడం లేదని ఆరోపించారు మాజీమంత్రి బొత్స సత్యనారాయణ. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌కు జగన్ భద్రతకు సంబంధంలేదని ఆయన తెలిపారు. తాము సమాచారం ఇచ్చే గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లామని.. అయినా ప్రభుత్వం భద్రత కల్పించలేదని చెప్పారు.
మాజీ సీఎంగా జగన్‌కు జెడ్‌ప్లస్ సెక్యూరిటీ వర్తిస్తుందని అన్నారు బొత్స. ప్రభుత్వం కుట్ర తమకు తెలుసని.. జెడ్‌ప్లస్ భద్రత ఉన్న జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ సెక్యూరిటీ ఉండాలని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భద్రత విషయంలో చంద్రబాబును ఎలాంటి ఇబ్బంది పెట్టలేదన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కావాలనే రాజకీయం చేస్తోందని మండిపడ్డారు వైసీపీ నేతలు.
అయితే వైసీపీ ఆరోపణలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. జగన్‌కు భద్రత లేదనడం డ్రామా అని మంత్రి బాలవీరాంజనేయస్వామి అన్నారు. తప్పు చేస్తే ఎవరిపైనైనా కేసులు పెడతారని.. ఎన్నికల కోడ్ అందరికీ వర్తిస్తుందని తెలిపారు. జగన్ ఎమ్మెల్యే మాత్రమే అని.. ఆయన ప్రతిపక్ష నేత కాదని మంత్రి సుభాష్ అన్నారు. జైలు యాత్రలతో ఖైదీలు, వాళ్ల కుటుంబసభ్యుల్లో జగన్‌కు మంచి క్రేజ్ వచ్చిందన్నారు. జగన్‌కు లండన్ మందులు వికటించినట్టున్నాయని ఆరోపించారు. జగన్‌కు భద్రత తగ్గించలేదన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం జగన్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా జగన్‌కు బుద్ధి రాలేదన్నారు. మిర్చి రైతులపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్నారు.
ఇదిలావుంటే,వైఎస్ జగన్‌కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు వైసీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి(Midhun Reddy) లేఖ రాశారు. మాజీ సీఎం జగన్‌కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ గుంటూరు పర్యటనలో భద్రత వైఫల్యం తలెత్తిందని లేఖలో మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయన్న వివరించిన మిథున్ రెడ్డి(Midhun Reddy). ఇవి కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలని లేఖలో సూచించారు. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోందన్న ఆయన, కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ సీఎం జగన్ ప్రాణాలకే ముప్పు ఉందని లేఖలో మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇప్పటివరకుజగన్ విపక్ష నేత హోదాపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరగుతుండగా.. తాజాగా ఆయనకు సరైన భద్రత కల్పించడం లేదని వైసీపీ ఆరోపించడంతో రాజకీయంగా కొత్త చర్చకు తెరలేచింది. మరి ఈ వ్యవహారంపై రాజకీయ రగడ ఎంతవరకు వెళుతుందో చూడాలి.
Also Read : USA Block : పనామా హోటల్ లో భారతీయులతో సహా 300 మందిని నిర్బంధించిన ట్రంప్ సర్కార్