Yusuf Pathan: అఖిలపక్ష దౌత్య బృందం నుండి యూసఫ్ పఠాన్ ఔట్… అభిషేక్ బెనర్జీ ఇన్
అఖిలపక్ష దౌత్య బృందం నుండి యూసఫ్ పఠాన్ ఔట్... అభిషేక్ బెనర్జీ ఇన్
ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు ఉద్దేశించిన ఏడు బృందాలు విదేశాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అందులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహంపుర్ కు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న యూసఫ్ పఠాన్ ను కేంద్రం ఎంపిక చేయడాన్ని ఆ పార్టీ తప్పుబట్టడంతో ఆయన ఈ బృందం నుంచి తప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో యూసఫ్ స్థానంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఆ పార్టీ ఎంపిక చేసింది. దీనిపై టీఎంసీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో తమ పార్టీ తరఫున అభిషేక్‌ను ఎంపిక చేయడం గర్వంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బెంగాల్ దృఢ వైఖరిని ఆయన ప్రతిబింబించడమే కాకుండా..ప్రపంచ దేశాల్లో భారత ప్రజల సమష్టి స్వరాన్ని వినిపిస్తారని తెలిపింది.
ప్రతినిధి బృందంలో యూసఫ్ పేరును చేర్చడంపై అభిషేక్ బెనర్జీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, దేశాన్ని రక్షించడం వంటి జాతీయ భద్రత విషయాలపై తమ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని… కానీ, తమను సంప్రదించకుండా పఠాన్ ను దౌత్యబృందంలో చేర్చడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఒక పార్టీ ఎంపీని ఎంపిక చేసేటప్పుడు ఆ పార్టీతో సంప్రదింపులు జరపాలని కేంద్రానికి సూచించారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరునాడే ఆయన పేరును పార్టీ తరఫున బృందంలో చేర్చడం గమనార్హం.
పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించడానికి భారత్ దౌత్యయుద్ధం ప్రారంభించింది. ఇందులోభాగంగా మొత్తం 51 మంది నేతలు 7 బృందాలుగా విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ బృందాల్లో పలు రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీలు, మంత్రులు, దౌత్యవేత్తలు ఉన్నారు. ఒక్కో బృందంలో ఒక ముస్లిం నేత గానీ, అధికారి గానీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. 51 మందిలో 31 మంది ఎన్డీయే నేతలు, 20 మంది ఎన్డీయేతర పార్టీల నేతలున్నారు. ‘ఒకే లక్ష్యం.. ఒకే సందేశం.. ఒకే భారత్’ పేరుతో ఈ పర్యటనలు సాగనున్నాయి.