Sansad Ratna Awards 2025: 17 మంది ఎంపీలకు సంసద్‌రత్న-2025 అవార్డులు

17 మంది ఎంపీలకు సంసద్‌రత్న-2025 అవార్డులు

Sansad Ratna Awards 2025 : పార్లమెంటులో ఉత్తమ పనితీరు కనబరిచిన 17 మంది ఎంపీలకు సంసద్‌రత్న-2025 అవార్డులను (Sansad Ratna Awards 2025) ప్రైమ్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఫౌండేషన్‌ అందజేసింది. ఇందులో సుప్రియా సూలే (ఎన్సీపీ-ఎస్పీ), రవి కిషన్‌ (బీజేపీ), నిశికాంత్‌ దుబె (బీజేపీ), అర్వింద్‌ సావంత్‌ (శివసేన-యూబీటీ) తదితరులున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి 2016 నుంచి వరుసగా మూడు సభల్లో కృషి చేసిన భర్తృహరి మెహ్‌తాబ్‌ (బీజేపీ-ఒడిశా), ఎన్‌కే ప్రేమచంద్రన్‌ (రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ-కేరళ), సుప్రియా సూలే (ఎన్సీపీ-ఎస్పీ, మహారాష్ట్ర), శ్రీరంగ్‌ అప్పా బార్నె (శివసేన, మహారాష్ట్ర)లకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు దక్కాయి.

Sansad Ratna Awards 2025 to 17 Candidates

వీరితోపాటు స్మిత ఉదయ్‌ వాగ్‌ (బీజేపీ), నరేశ్‌ మహాస్కే (శివసేన), వర్ష గైక్వాడ్‌ (కాంగ్రెస్‌), మేధ కులకర్ణి (బీజేపీ) (BJP), ప్రవీణ్‌ పటేల్‌ (బీజేపీ), విద్యుత్‌ బారన్‌ మహతో (బీజేపీ), దిలీప్‌ సైకియా (బీజేపీ) తదితరులు ఇతర అవార్డులకు ఎంపికయ్యారు. కమిటీల కేటగిరీలో ఉత్తమ నివేదికలు ఇచ్చిన ఆర్థిక, వ్యవసాయ స్టాండింగ్‌ కమిటీలకు ఛైర్మన్లుగా ఉన్న భర్తృహరి మెహ్‌తాబ్, చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నిలు (కాంగ్రెస్‌) అవార్డులు అందుకున్నారు.

సభలో అంతరాయం వలన ప్రతిపక్షానికే నష్టం – రిజిజు

పార్లమెంటులో తరచూ అంతరాయాలవల్ల ప్రతిపక్షాలే నష్టపోతాయని, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచే అవకాశాన్ని కోల్పోతాయని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అభిప్రాయపడ్డారు. సంసద్‌రత్న-2025 అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వం పార్లమెంటులో జవాబుదారీగా ఉంటుంది. సభ జరుగుతున్నప్పుడు మంత్రులు కఠిన ప్రశ్నలను ఎదుర్కొంటారు. వెంటనే సభ వాయిదా పడితే వారు ఉపశమనం పొందుతారు. అప్పుడు మంత్రుల దగ్గరి నుంచి సమాధానాలు రావు’ అని పేర్కొన్నారు. సోమనాథ్‌ ఛటర్జీ లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న సమయంలో ఆయనను తొలిసారి కలిసినప్పుడు ధూమపానం చేసే ఎంపీల కోసం స్మోకింగ్‌ రూం ఏర్పాటు చేయాలని కోరానని, దీంతో ఆగ్రహించిన సోమనాథ్‌.. స్పీకర్‌తో జరుగుతున్న మొదటి సమావేశంలో ఇటువంటి విషయాలు చర్చించడానికి వచ్చారా అని తనను తీవ్రంగా మందలించారని తెలిపారు. నాటి నుంచి అత్యున్నత పదవుల్లో ఉన్న వారి దృష్టికి ఎటువంటి సమస్యలు తీసుకువెళ్లాలి.. వారితో ఎలా మాట్లాడాలనే విషయాలను తెలుసుకున్నానని పేర్కొన్నారు.

Also Read : Mallikarjun Kharge: రాజీనామా విషయంలో ఏం జరిగిందో ఆయనే చెప్పాలి – మల్లికార్జున ఖర్గే

Leave A Reply

Your Email Id will not be published!