Bihar Assembly Elections: బిహార్ ఎన్నికల ప్రచారానికి రోజుకు 20 హెలికాప్టర్లు ?
బిహార్ ఎన్నికల ప్రచారానికి రోజుకు 20 హెలికాప్టర్లు ?
Bihar Assembly Elections : బిహార్ లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు హెలికాప్టర్ల బుకింగ్ ల కోసం పోటీపడుతున్నాయి. 2020 ఎన్నికల్లో కొవిడ్ కారణంగా బుకింగ్ లు పెద్దగా జరగలేదు. ఈసారి మాత్రం పోటాపోటీగా ప్రచారం జరగనుండటంతో హెలికాప్టర్లకు గిరాకీ అమాంతంగా పెరిగింది. బిహార్ (Bihar) లో సాధ్యమైనంత మేరకు అన్ని నియోజకవర్గాలను చుట్టేయాలని ముఖ్యనేతలు భావిస్తున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు మార్గాలను నమ్ముకుంటే ప్రచారంలో వెనకబడతామనే భయం వారిలో నెలకొంది. అందుకే రోజుకు కనీసం 20 హెలికాప్టర్లు గాల్లో ఎగిరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఇండియా బ్లాక్ నేతలు ఇప్పటికే పలు హెలికాప్టర్లను బుక్ చేసుకొని ప్రచారానికి సిద్ధంగా ఉన్నారు.
Bihar Assembly Elections Update
భారతీయ జనతా పార్టీ (BJP), జేడీయూ కూటమి చేతిలో డజన్ కు పైగా హెలికాప్టర్లు ఉన్నట్లు సమాచారం. అందులో దాదాపు 12 హెలికాప్టర్లు బీజేపీ నేతలే వినియోగిస్తారని తెలిసింది. ఐదు హెలికాప్టర్లతో ప్రచారం ముగించేయాలని ప్రతిపక్షం భావిస్తోంది. కాంగ్రెస్ రెండు హెలికాప్టర్లను బుక్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆర్జేడీ కూడా కొన్ని బుక్ చేసింది. ఒక సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ అద్దె గంటకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. అదే డబుల్ ఇంజిన్ అయితే రూ.3 నుంచి రూ.4 లక్షలు వెచ్చించాల్సి రావొచ్చు. ఎన్నికల సందడిలో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. సింగిల్ ఇంజిన్ అద్దె 25 శాతం, డబుల్ ఇంజిన్ అద్దె 100 శాతం పెరగొచ్చని తెలుస్తోంది. రోజూ వారీ కార్యక్రమాల కోసం బుకింగ్‌లు చేసుకునే నేతలు జీఎస్టీతో కలిపి మూడు గంటల అద్దె ముందుగా చెల్లించాలి.
ఇదిలాఉండగా… తాము పరిమిత వనరులతోనే ప్రచారం సాగిస్తున్నామని ఆర్జేడీ నేత రాజేశ్ యాదవ్ తెలిపారు. ‘మా అధినేత లాలూప్రసాద్ యాదవ్ పాతబడిన జీపులో ప్రచారం చేస్తారు’ అని పేర్కొన్నారు. తేజస్వీకి యువత మద్దతు ఉందని వ్యాఖ్యానించారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను చుట్టేయాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రమే హెలికాప్టర్లను వినియోగిస్తామని స్పష్టంచేశారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేయాలనే ఆలోచనతో హెలికాప్టర్లు బుకింగ్ చేసుకుంటున్నామని భాజపా అధికార ప్రతినిధి వినోద్ శర్మ తెలిపారు. గత ఎన్నికల కంటే ఇప్పుడు ఎక్కువ హెలికాప్టర్లు బుక్ అయ్యాయని పట్నా ఎయిర్‌పోర్టు గ్లోబల్ ఫ్లైట్ సర్వీస్ మేనేజర్ దేవేంద్ర కుమార్ వెల్లడించారు.
Also Read : Telangana Government: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా ?
