Operation Kagar: ఆపరేషన్‌ కగార్ లో 31 మంది మావోయిస్టులు మృతి – డీజీపీ అరుణ్‌దేవ్‌ గౌతం

ఆపరేషన్‌ కగార్ లో 31 మంది మావోయిస్టులు మృతి - డీజీపీ అరుణ్‌దేవ్‌ గౌతం

 

ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్ దండకారణ్యంలో ఇటీవల జరిగిన వరుస ఎన్ కౌంటర్లతో పెద్ద ఎత్తున మావోయిస్టులు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో గల కర్రెగుట్టల్లో తల దాచుకున్న విషయం తెలిసిందే. దీనితో కర్రెగుట్టలను జల్లెడ పట్టడానికి ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు ఆపరేషన్ కగార్ ను చేపట్టాయి. వందలాది మంది సాయుధ బలగాలను కర్రెగుట్టలు చుట్టూ మోహరించి… హెలీకాఫ్టర్లు, డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల ఆచూకీ కోసం గాలించారు. ఈ నేపథ్యంలో గత 21 రోజులుగా ఇటు తెలంగాణాలోని ములుగు జిల్లా, ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్ జిల్లా మధ్య రోజూ ఏదోఒక చోట కాల్పుల మ్రోత వినిపించేది. ఈ కాల్పుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోయారు అనే ఊహాగానాలు వినిపించేవి. అయితే వాటిపై సీఆర్పిఎఫ్ డీజీ జీపీ సింగ్, ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ అరుణ్‌దేవ్‌ గౌతం బుధవారం క్లారిటీ ఇచ్చారు.

బుధవారం బీజాపూర్‌ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఆర్పిఎఫ్ డీజీ జీపీ సింగ్, ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ అరుణ్‌దేవ్‌ గౌతం మాట్లాడుతూ… తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు బీజాపూర్ జిల్లా ఉసురు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కర్రెగుట్ట కేంద్రంగా జరిగిన ఆపరేషన్‌లో 31మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆపరేషన్ జరిగిన 21 రోజుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో 16 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో మృతి చెందిన మావోయిస్టులపై రూ.1.72 కోట్ల రివార్డు ఉందని పేర్కొన్నారు. 18 మంది జవాన్లు గాయపడినట్లు చెప్పారు. మృతి చెందిన మావోయిస్టుల్లో 20 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. 31 మంది మావోయిస్టుల నుంచి 35 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు కర్రెగుట్ట ఆపరేషన్ నిర్వహించామన్నారు. ఈఏడాది మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్‌ లో 174 మంది హార్డ్ కోర్ మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

 

Leave A Reply

Your Email Id will not be published!