Sabarimala Temple: శబరిమల విగ్రహాలపై 4.5 కిలోల బంగారం మిస్సింగ్
శబరిమల విగ్రహాలపై 4.5 కిలోల బంగారం మిస్సింగ్
Sabarimala Temple : కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో విగ్రహాల బంగారు పూతపూసిన తాపడాలను అనుమతి లేకుండా తొలగించడం ఇటీవల వివాదాస్పదమైంది. తాజాగా ఇందుకు సంబంధించిన మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విగ్రహాల తాపడాలపై బంగారం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది.
Sabarimala Temple – అసలేం జరిగిందంటే ?
శబరిమలలో గర్భగుడి (Sabarimala Temple) ముందు ఉన్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూతపూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరి చేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ తెలిపింది. అంతేగాక, ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు తెలిసింది.
ఈ పరిణామాలపై తాజాగా కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఉన్నట్టుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. ఈ తగ్గుదలకు ఏకైక కారణంగా బంగారు పూత తగ్గడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. లేదంటే దాత వాటి స్థానంలో మరో తాపడాల సెట్‌ను కంపెనీకి ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంది. ఇందులో అనేక లోపాలు కనిపిస్తున్నాయని, బరువు ఎలా తగ్గిందో తెలుసుకునేందుకు విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకు సహకరించాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డుకు సూచించింది. దీనిపై మూడు వారాల్లోగా పూర్తి నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను సెప్టెంబరు 30వ తేదీకి వాయిదా వేసింది.
శబరిమల స్పెషల్ కమిషనర్‌కు సమాచారం ఇవ్వకుండానే ద్వారపాలక విగ్రహల బంగారు తాపడాలను మరమ్మతుల నిమిత్తం తొలగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా వాటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. దీనిపై బోర్డు నుంచి వివరణ కోరింది.
Sabarimala Temple – శబరిమలలో గ్లోబల్ అయ్యప్ప కాన్‌క్లేవ్
కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం (Sabarimala Temple) అభివృద్ధిపై సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంబా తీరంలో ప్రపంచ అయ్యప్ప భక్తుల సంగమాన్ని ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. శనివారం (సెప్టెంబర్ 20) జరగనున్న ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని కేరళ దేవాదాయశాఖ మంత్రి వి.ఎన్. వాసవన్ తెలిపారు. ఈ మహా సంగమంలో వివిధ దేశాల నుంచి సుమారు 3000 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
విరాళాలుగా వచ్చిన రూ.7కోట్లతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వాసవన్ చెప్పారు. ఈ కాంక్లేవ్‌లో కేరళ ప్రభుత్వం శబరిమల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రూ. 1300 కోట్ల మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డు ద్వారా నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు ప్రపంచ అయ్యప్ప భక్తుల సంగమం శబరిమల అభివృద్ధి, ఆచార సంప్రదాయాల పరిరక్షణ,భక్తుల సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.
Also Read : Rahul Gandhi: సాఫ్ట్‌వేర్ తో ఓటర్ ఐడీలను తొలగిస్తున్నారు – రాహుల్ గాంధీ ఆరోపణ
