Bihar Voter List: బిహార్ లో 52లక్షల ఓటర్లు ‘మిస్సింగ్’ ?
బిహార్ లో 52లక్షల ఓటర్లు ‘మిస్సింగ్’ ?
Bihar : బిహార్ లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో అధికారులు కీలక విషయాలు వెలుగులోనికి వచ్చాయి. రాష్ట్రంలో 52 లక్షల ఓటర్ల మంది… సంబంధిత చిరునామాల్లో లేరని వెల్లడైంది. వీరిలో 18 లక్షల మంది ఓటర్లు చనిపోగా, 26లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్లు ఈసీ తెలిపింది. మరో ఏడు లక్షల మంది ఓటర్లు రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది.
Bihar Voter List Updates
‘బిహార్ ఎస్ఐఆర్‌లో ఇంతవరకూ వెల్లడైన నిజాలు’ అనే పేరుతో ఎన్నికల కమిషన్ ఒక నోట్ విడుదల చేసింది. ఇంతవరకూ నిర్వహించిన బిహార్ (Bihar) స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో 18 లక్షల మంది ఓటర్లు చనిపోయినట్టు తమ దృష్టికి రాగా, 26 లక్షల మంది వివిధ నియోజకవర్గాలకు షిఫ్ట్ అయ్యారని, రెండు చోట్ల పేర్లు నమోదు చేసుకున్న వారు 7 లక్షల మంది ఉన్నారని వివరించింది.ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 7.89 కోట్ల మంది ఓటర్లు ఉండగా… ఇప్పటివరకు 7.68 కోట్ల మంది వివరాలను సేకరించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. 52 లక్షల మంది సంబంధిత చిరునామాల్లో లేరని గుర్తించినట్లు తెలిపింది. అయితే, మరో 21 లక్షల మంది ఇంకా తమ వివరాలు సమర్పించాల్సి ఉన్నట్లు ఈసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఆగస్టు 1 నుంచి ముసాయిదా ఎన్నికల జాబితా ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం (EC) వెల్లడించింది. ఇప్పటికే వీటికి సంబంధించిన వివరాలను రాష్ట్రంలోని 12 ప్రధాన పార్టీలతో పంచుకున్నామని, తద్వారా పేర్లను ఎందుకు తొలగించామో అందరికీ తెలుస్తుందని పేర్కొంది. సెప్టెంబర్ 1 వరకు సామాన్యులు సహా ఎవరైనా అభ్యంతరాలు తెలపవచ్చని సూచించింది. జాబితాలో పేర్లు లేనివారు నిర్ణీత గడువులోపు అధికారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. తుది ఓటరు జాబితాను సెప్టెంబర్ 30న ప్రచురిస్తారు.
ఇదిలాఉంటే, ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను వ్యతిరేకిస్తూ… ప్రతిపక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ బాధ్యతగా ఎస్ఐఆర్‌ను నిర్వహిస్తున్నామని ఈసీ తెల్చి చెప్పింది. ఎస్ఐఆర్‌పై ఈసీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉండగా, తాము చేపట్టిన ప్రక్రియ చట్టబద్ధమని, రాజ్యాంగంలోని 324వ నిబంధనకు లోబడి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఎన్నికల కమిషన్ చెబుతోంది. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఎస్‌ఐఆర్‌ను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, ప్రాథమిక పత్రాలుగా ఆధార్, రేషన్ కార్డుతో పాటు స్వయంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడీ కార్డును పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈసీని అనుమానించడానికి ఏమీ లేదని, ఈ అంశంపై మరింత విచారణ జరగాల్సి ఉందని వ్యాఖ్యానించింది.
Also Read : Anil Kumar Yadav: క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
