Bihar: బిహార్ లో 65 లక్షల ఓటర్లు ‘మిస్సింగ్’ ?
బిహార్ లో 65 లక్షల ఓటర్లు ‘మిస్సింగ్’ ?
Bihar : బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తైన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితా విడుదలయ్యింది. ఇందులో మొత్తంగా 65లక్షల ఓటర్లను చేర్చలేదని వెల్లడైంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ చేపట్టక ముందు రాష్ట్రంలో మొత్తం నమోదిత ఓటర్ల సంఖ్య 7.9 కోట్లుగా ఉండగా, తాజా ముసాయిదాలో అది 7.24కోట్లకు తగ్గింది.
Bihar Voters Missing
రాజధాని పట్నాలో అత్యధికంగా 3.95లక్షలు, మధుబనీలో 3.52లక్షలు, ఈస్ట్ చంపారన్‌లో 3.16లక్షలు, గోపాల్‌గంజ్‌లో 3.10లక్షల ఓటర్లు సంబంధిత దస్త్రాలను అందించకపోవడంతో వారిని ఈ జాబితాలో చేర్చలేదని ఈసీ వెల్లడించింది. మొత్తం జాబితాలో 22.34లక్షల మంది ఓటర్లు చనిపోయారని, 36.28లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడం లేదా ఆయా చిరునామాలో లేరని ఈసీ గుర్తించింది. మరో 7.01 లక్షల మంది ఒకటి కన్నా ఎక్కువసార్లు నమోదు చేసుకున్నట్లు గుర్తించామని తెలిపింది.
బిహార్‌లో (Bihar) అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)ను ఎన్నికల సంఘం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో ముసాయిదా జాబితాను ఈసీ శుక్రవారం విడుదల చేసింది. దీనిని ప్రధాన రాజకీయ పార్టీలకు అందజేసింది. తాజాగా ఓటర్లకు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 1లోగా ఈసీకి తెలియజేయవచ్చు. ఆ తర్వాత ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రచురిస్తుంది. ఈసీ చేపట్టిన ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఆర్జేడీ వంటి విపక్ష పార్టీలు ఈ ముసాయిదాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు అనుకూలంగా ఉండేందుకే దీన్ని చేపట్టాయని ఆరోపిస్తూ రాజధాని పట్నాలో నిరసన తెలిపాయి.
Also Read : AP Police: పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
