G Kishan reddy : తెలంగాణకు సీఎం శాపం – కేంద్ర మంత్రి
మోదీని తిట్టేందుకే సగం టైం కేటాయింపు
G Kishan reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల భారతీయ జనతా పార్టీ మరింత దూకుడు పెంచింది. తాజాగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్ సంగ్రామ పాదయాత్ర యాదాద్రి నుంచి ప్రారంభమైంది.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గుదిబండగా మారారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలతో పాటు నేరాలకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని తప్పు పడుతున్న రాష్ట్ర సర్కార్ కు చిత్తశుద్ది లేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ల ఇళ్లు ఎంత మందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు కేంద్ర మంత్రి.
నెలలో 15 రోజులు ఫామ్ హౌస్ లో సేద దీరితే మిగతా 15 రోజులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తిట్టేందుకే సరి పోతుందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రం ఓ వైపు అప్పుల కుప్పగా మారిందని, సమస్యలు పేరుకు పోయాయని కానీ ఇప్పటి వరకు పరిష్కరించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రాన్ని ఉద్దరించలేని సీఎం కేసీఆర్ దేశాన్ని ఎలా ఉద్దరిస్తాడని ప్రశ్నించారు.
కేసీఆర్ కు అంత సీన్ లేదన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి జనం పట్టం కట్టడం ఖాయమన్నారు కిషన్ రెడ్డి(G Kishan reddy). కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎంకు, ఆ పార్టీ ప్రతినిధులకు, మంత్రులకు లేనే లేదన్నారు.
కేజీ టు పీజీ ఏమైందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి.
Also Read : నీ విజయం యువతకు స్ఫూర్తి దాయకం