Manish Sisodia : ఆప్ సైనికులు అమ్ముడు పోరు – సిసోడియా
బీజేపీని హెచ్చరించిన డిప్యూటీ సీఎం
Manish Sisodia : ఆప్ ఎమ్మెల్యేలకు రూ. 20 కోట్ల బంపర్ ఆఫర్ ను బీజేపీ ప్రకటించడంపై నిప్పులు చెరిగారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఆప్ సైనికులు ఎవరూ చిల్లర రాజకీయాలు చేయరని, ప్రధానంగా ఎవరికీ అమ్ముడు పోయే రకం కాదన్నారు.
వీరంతా కేజ్రీవాల్ సారథ్యంలోని సైనికులు. షహీద్ భగత్ సింగ్ అనుచరులు. వీళ్లను కొనుగోలు చేయాలని అనుకోవడం ఒట్టి భ్రమగా పేర్కొన్నారు మనీష్ సిసోడియా. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ మొత్తం ఎపిసోడ్ పై భవిష్యత్తు కార్యాచరణ ఏమిటని నిర్ణయించేందుకు గాను ఇవాళ కీలకమైన సమావేశాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏర్పాటు చేశారని వెల్లడించారు.
ఇందులో ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రలోభాలకు గురి చేసే ప్లాన్ గురించి ప్రస్తావనకు రానుందన్నారు సిసోడియా. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీ దాడులకు, సోదాలకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం(Manish Sisodia).
తమ నేతలు బీజేపీ వారి లాగా అమ్ముడు పోయే రకం కాదన్నారు. ఈ విషయం ఎంత తెలుసుకుంటే అంత మంచిదన్నారు.
నలుగురు ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 20 కోట్ల చొప్పున బంపర్ ఆఫర్ ప్రకటించిందని తాజాగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.
దీనిపై సీరియస్ గా స్పందించారు మనీష్ సిసోడియా. 20 కోట్లు తీసుకోండి లేదంటే సీబీఐని ఎదుర్కోండి అంటూ బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.