Ghulam Nabi Azad : ఆర్టికల్ 370ని పునరుద్దరించలేం – ఆజాద్
సంచలన ప్రకటన చేసిన ట్రబుల్ షూటర్
Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉత్తర కాశ్మీర్ లోయలోని బారాముల్లాలో జరిగిన తన మొదటి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఆర్టికల్ 370 గురించి ప్రస్తావించారు. 2019లో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రద్దు చేసిన ఆ ఆర్టికల్ ను తిరిగి తీసుకు రాలేమని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో తన పోరాటం కొనసాగుతుందన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాను నడుచుకుంటానని చెప్పారు. తాను కేవలం 10 రోజుల్లో పార్టీని ప్రకటిస్తానని చెప్పారు.
ఈ పార్టీ పూర్తిగా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు, సూచనలు ఆధారంగా చేసుకుని ప్రకటన ఉంటుందన్నారు గులాం నబీ ఆజాద్. ఒకసారి రాజ్యాంగ బద్దంగా తీసుకున్న నిర్ణయం ఏదైనా తిరిగి పునరుద్దరించడం జరగదని స్పష్టం చేశారు.
ఆచరణకు నోచుకోని హామీలను తాను ఇవ్వడం లేదని, తనకు ఇష్టం లేదన్నారు. ఇక్కడ కొలువు తీరిన కొన్ని పార్టీలు ఆర్టికల్ 370ని పునరుద్దరించేలా చేస్తామని మోసపూరిత ప్రకటనలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రజలకు ఏం చేస్తామో చెప్పాలే కానీ ఆచరణకు నోచుకోని హామీలను ఇవ్వకూడదన్నారు. తాను ఏది చేస్తానో అదే చెబుతానని వేరే చెప్పడం తనకు ముందు నుంచీ అలవాటు లేదన్నారు గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) .
నేను ఎవరినీ తప్పు దోవ పట్టించ దల్చుకోలేదన్నారు. దోపిడీకి పాల్పడను. దయచేసి సాధించ లేని సమస్యలను ప్రస్తావించ వద్దని కోరారు ఆజాద్.
ఇది కావాలంటే పార్లమెంట్ లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం పడుతుందన్నారు. ఇప్పట్లో అది సాధ్యం అయ్యే పని కాదన్నారు.
Also Read : రాహుల్ పెళ్లిపై తమిళనాడులో చర్చ