S Jai Shankar : యుద్దాన్ని వెంటనే విరమించండి – జై శంకర్
రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ కు భారత్ విన్నపం
S Jai Shankar : యుద్ధం ఎన్నటికీ ఆమోద యోగ్యం కాదని, దాని వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని భారత్ స్పష్టం చేసింది. వెంటనే ఏకపక్షంగా ప్రారంభించిన యుద్దాన్ని విరమించు కోవాలని సూచించారు భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar).
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన కీలక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్, రష్యా యుద్దం యూరప్ దేశాలనే కాదు యావత్ ప్రపంచంపై ప్రభావాన్ని చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత దేశం ఏ దేశానితో యుద్దం కోరుకోదన్నారు. ప్రస్తుతం ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు ఆయా దేశాల మధ్య ప్రధాన సవాళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత దేశం మొదటి నుంచీ శాంతిని కోరుకుంటోందని తమది శాంతి కాముక దేశమన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే రష్యా చీఫ్ పుతిన్ తో సమావేశమై యుద్దాన్ని విరమించు కోవాలని కోరారని చెప్పారు జై శంకర్(S Jai Shankar).
అంతర్జాతీయ సమాజం మొత్తం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. ఉక్రెయిన్ పై యుద్దం వల్ల రష్యా ఏం సాధించిందో ఒకసారి మననం చేసుకోవాలని సూచించారు.
తాము ఏ దేశానికి వ్యతిరేకం కాదన్నారు. ఆయా దేశాలు పరస్పరం చర్చించు కోవడం ద్వారా సానుకూలంగా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉందన్నారు.
ప్రస్తుత యుగాన్ని టెక్నాలజీ శాసిస్తోందని ఇది యుద్దం చేసే యుగం కాదని మరోసారి స్పష్టం చేశారు జై శంకర్. ఇకనైనా పునరాలోచించుకుని వెంటనే ఉక్రెయిన్ నుంచి దళాలను ఉపసహరించాలని రష్యా చీఫ్ ను కోరారు.
Also Read : పెరుగుతున్న కరోనా కేసులతో పరేషాన్