Mallikarjun Kharge : సమిష్టి నాయకత్వం పార్టీకి అవసరం – ఖర్గే
సంచలన కామెంట్స్ చేసిన ఎంపీ
Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి బరిలో ఉన్న రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు పోటీగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది పోరు. ఖర్గేకు సోనియా గాంధీ ఫ్యామిలీ అండగా ఉండగా శశి థరూర్ స్వంతంగా పోటీ చేస్తున్నారు.
ఇద్దరూ పార్టీకి విధేయులమంటున్నారు. ఇద్దరూ తమ తమ ప్రచారాల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) మాట్లాడుతూ సమిష్టి నాయకత్వం పార్టీకి అత్యంత అవసరమని స్పష్టం చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన చింతన్ శివిర్ లో ఆమోదించిన ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను తాను గెలిస్తే అమలు చేస్తానని చెప్పారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. 50 ఏళ్ల లోపు వారికి పార్టీకి సంబంధించిన బాధ్యతలను అప్పగించడం ద్వారా మరింత బలోపేతం చేస్తానని అన్నారు మల్లికార్జున్ ఖర్గే. పార్టీలో కొత్త రక్తం తీసుకు రావడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు.
134 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలని తనను సోనియా గాంధీ కోరారని చెప్పారు ఖర్గే. గౌహతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుటుంబమైనా లేదా పార్టీ అయినా ఒక్కటేనని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం అనిశ్చితి ఏర్పడిందని దానిని తొలగించేందుకు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు.
బీజేపీ ఆచరణకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేస్తోందంటూ ఆరోపించారు.
Also Read : అర్బన్ నక్సల్స్ ఆటలు సాగవు – మోదీ