Rajyavardhan Singh Rathore : రాహుల్ పై రాథోడ్ ఫైర్
సైనికుల మనోభావాలు దెబ్బ తీస్తే ఎలా
Rajyavardhan Singh Rathore : ఓ వైపు చైనా యుద్దానికి సిద్దమవుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గాఢ నిద్రలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. ఆయన రాజస్థాన్ లో భారత్ జోడో యాత్ర సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రధానిని, కేంద్ర సర్కార్ ను ఏకి పారేశారు.
మోదీ ప్రధానిగా ఫెయిల్ అయ్యారని, దేశం ఓ వైపు సమస్యలతో సతమతం అవుతుంటే మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. రాను రాను చైనా దాడి చేసినా ఏమీ చేయలేని పరిస్థితికి దేశ ఆర్మీ దిగజారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించింది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీకి చెందిన ఎంపీ రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ నిప్పులు చెరిగారు(Rajyavardhan Singh Rathore). రాహుల్ గాంధీ అనుకున్నట్టు మోదీ నిద్ర పోవడం లేదని సింహంగా గర్జించేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు.
ఆనాటి నెహ్రూ లాగా వెనక్కి వెళ్లే నాయకుడు కాదన్నారు. ఇప్పటికే అగ్ని ని ప్రయోగించామని చైనా భారత్ ను చూసి, తమ బలాన్ని గుర్తించి వెనక్కి తగ్గిందన్నారు. తాము ఉన్నంత వరకు ఒక్క సెంటు భూమి కూడా ఏ దేశమూ తీసుకోలేదన్నారు. రాహుల్ గాంధీ చౌకబారు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.
లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ హెచ్చరించారు. ఓ వైపు బాధ్యత కలిగిన నాయకుడిగా సైనికులకు మద్దతు పలకాల్సింది పోయి ఇలా నిర్వీర్యం చేస్తారా అంటూ ప్రశ్నించారు రాథోడ్.
Also Read : దేశంలో అసలు ‘పప్పు’ ఎవరు