Bandi Sanjay Arrest : బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై దీక్ష
Bandi Sanjay Arrest : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ)లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గన్ పార్క్ వద్ద దీక్ష చేపట్టిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay Arrest) ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బలవంతంగా పోలీసులు తీసుకు వెళ్లారు. అంతకు ముందు గన్ పార్క్ నుంచి ర్యాలీగా టీఎస్ పీఎస్సీ ఆఫీసుకు బయలు దేరారు బండి సంజయ్ . భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. టీఎస్ పీఎస్సీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్బంగా బండి సంజయ్(Bandi Sanjay) నిప్పులు చెరిగారు. చేతగాని ప్రభుత్వం ఉండడం వల్లనే ఇలాంటి లీక్ లు, స్కాములు, ఆత్మహత్యలు, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.
వెంటనే టీఎస్ పీఎస్సీ చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నో సిట్ లు ఏర్పాటు చేసిందని కానీ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నిజాలు వెల్లడించ లేదని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ ఉద్యోగాలు రాక నానా తంటాలు పడుతున్నారని అయినా సీఎం కేసీఆర్ స్పందించడం లేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
Also Read : దొర పాలనలో జనం ఆగమాగం