YS Sharmila : కేసీఆర్ ఉన్నంత దాకా జాబ్స్ రావు
వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన ఆరోపణలు చేశారు. కోరి తెచ్చుకున్న తెలంగాణలో బాధలు , కష్టాలు , మోసాలు తప్ప ఇంకేవీ లేవన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ఊసే లేకుండా పోయిందన్నారు. గతంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడినా చలించ లేదని, ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పరీక్ష పేపర్లు లీక్ అయినా పట్టించు కోవడం లేదన్నారు.
భారత రాజ్యాంగాన్ని మారుస్తానని అప్పట్లో ప్రగల్భాలు పలికారని, ఎమ్మెల్యేల కేసు విషయంలో మీడియా ముందుకు వచ్చిన సీఎం ఇవాళ ఇంత పెద్ద లీకేజీ జరిగితే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. టీఎస్పీఎస్సీ బోర్డు అంగట్లో సరుకులు అమ్మకానికి పెట్టినట్లు పరీక్ష పేపర్లు బహిరంగంగా అమ్మకానికి పెట్టిన సీఎంకు సోయి లేకుండా పోయిందని ఆరోపించారు. టీఎస్పీఎస్సీలో స్కాం చోటు చేసుకుని నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు విచారణలో దోషులెవరో, దొంగలు ఎవరో తేల్చ లేదన్నారు.
ఇప్పటి వరకు దీనిపై సమీక్ష చేపట్టలేదు. సమావేశం నిర్వహించిన పాపాన పోలేదని పేర్కొన్నారు. నిరుద్యోగులకు సంబంధించి న్యాయం కోసం అడిగితే తమపై పోలీసులను ఉసిగొల్పుతున్నారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిల(YS Sharmila). తనను హౌజ్ అరెస్ట్ చేశారని ఇదేనా ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ కు కాలం చెల్లిందన్నారు.
Also Read : స్వలింగ వివాహంపై కీలక కామెంట్స్