Kejriwal MK Stalin : కేజ్రీవాల్ పోరాటానికి స్టాలిన్ మద్దతు
ధన్యవాదాలు తెలిపిన ఢిల్లీ సీఎం
Kejriwal MK Stalin : ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Kejriwal). గురువారం ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ , ఢిల్లీ మంత్రి అతిషి, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మర్యాద పూర్వకంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ను కలిశారు. ఈ సందర్బంగా వారికి సాదర స్వాగతం పలికారు సీఎం. జ్ఞాపికను అందజేశారు. అనంతరం సీఎంలు అరవింద్ కేజ్రీవాల్ , భగవంత్ మాన్ , ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికే ఒక్క లా అండ్ ఆర్డర్, భూ సంబంధ అంశాలు తప్ప లెఫ్టినెంట్ గవర్నర్ కు ఏవీ ఉండవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రజలు ఎన్నుకున్న ఢిల్లీ ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. అయినా కయ్యానికి కాలు దువ్వింది కేంద్రం. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది కేంద్రం. చట్టం కావాలంటే పార్లమెంట్ లోని ఉభయ సభలు లోక్ సభ, రాజ్యసభలో పాస్ కావాల్సి ఉంటుంది. లోక్ సభలో బీజేపీకి బలం ఉన్నప్పటికీ రాజ్యసభలో లేదు. దీంతో ఆప్ ప్రతిపక్ష పార్టీలు, నేతలను కలుస్తూ వస్తున్నారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ తమకు మద్దతు ఇచ్చినందుకు స్టాలిన్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని నిరసిస్తూ కేంద్రంపై పోరాడుతున్న సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు సీఎం భగవంత్ మాన్. ఇదిలా ఉండగా ఆప్ విన్నపాన్ని అర్థం చేసుకున్నామని డీఎంకే మద్దతు ఇస్తుందని చెప్పారు స్టాలిన్.
Also Read : Rahul Gandhi Comment