Yandamuri Veerendranath : నవలా రచయిత
వ్యక్తిత్వ వికాస నిపుణులు, నవలా రచయిత
Yandamuri Veerendranath : యండమూరి వీరేంద్రనాథ్ (నవంబరు 14, 1948): సుప్రసిద్ధ నవలా రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ తూర్పుగోదావరి జిల్లా రాజోలులో నవంబరు 14, 1948లో జన్మించారు. వీరేంద్రనాథ్ తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగి కావడంతో ఆయన బాల్యం మరియు విద్య కాకినాడ, రాజమండ్రి, జమ్మలమడుగు, అనంతపురం, హైదరాబాద్ వంటి అనేక ప్రాంతాల్లో గడిచింది.
Yandamuri Veerendranath – రచయితగా మారడానికి ఉద్యోగ విరమణ చేసిన యండమూరి
1972లో చార్టెడ్ అకౌంటెంట్ గా పట్టా పొందిన యండమూరి(Yandamuri Veerendranath) ఐదు సంవత్సరాల పాటు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో, పది సంవత్సరాల పాటు ఆంధ్రా బ్యాంకు చిన్న తరహా పరిశ్రమల విభాగానికి అధిపతిగా పనిచేసి పూర్తిస్థాయి రచయితగా మారడం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నవలా రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన యండమూరి…. ప్రస్తుతం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, సినిమా మాటల రయితగా, దర్శకుడిగా, నటుడిగా కొనసాగుతున్నారు.
వ్యక్తిత్వ వికాసం గురించి యండమూరి రాసిన అనేక పుస్తకాలు నేటి తరం యువతకు ఒక దిక్సూచీగా మారాయి. ముఖ్యంగా విజయానికి అయిదు మెట్లు, విజయానికి ఆరవ మెట్టు, విజయ రహస్యాలు, మిమ్మల్ని మీరు గెలవగలరు, విజయంలో భాగస్వామ్యం, విజయం వైపు పయనం, మైండ్ పవర్ నెంబర్ ఒన్ అవడం ఎలా? వంటి పుస్తకాలు వ్యక్తిత్వ వికాసానికి నేటి తరం యువతకు ఒక డిక్షెనరీగా పనిచేస్తున్నాయి. వివిధ నాటకాలు, నాటికలు, నవలలు, సినిమాల కోసం, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ఉపన్యాసాలలో ఈయన వ్రాసిన ఈ పంక్తులు, చెప్పిన మాటలు యండమూరి ప్రత్యేక శైలికి నిలువెత్తు నిదర్శనం.
హిట్ సినిమాలుగా యండమూరి నవలలు
యండమూరి రచించిన అనేక నవలలు చదివిన వారిని ఎంతగానో ప్రభావితం చేయడమే కాకుండా కొన్ని నవలలు సినిమాలుగా కూడా వచ్చాయి. సినిమాలుగా వచ్చిన యండమూరి(Yandamuri) నవలల్లో వెన్నెల్లో ఆడపిల్ల (హలో ఐ లవ్ యూ), అభిలాష (అభిలాష), డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు (ఛాలెంజ్), మరణ మృదంగం (మరణ మృదంగం), నల్లంచు తెల్లచీర (దొంగమొగుడు), ఆఖరి పోరాటం (ఆఖరి పోరాటం), స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ (స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్), రుద్రనేత్ర (రుద్రనేత్ర), రాక్షసుడు (రాక్షసుడు) ముఖ్యమైనవి.
సినిమాలుగా వచ్చిన యండమూరి నవలల్లో సింహభాగం మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమాలే కావడం విశేషం. కొండవీటి దొంగ, అభిలాష, మంచు పల్లకి, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, ప్రియరాగాలు వంటి సినిమాలకు యండమూరి మాటలు, కధా రచయితగా ఉన్నారు. అగ్నిప్రవేశం, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్, దుప్పట్లో మిన్నాగు, అతడు ఆమె ప్రియుడు అనే సినిమాలతో యండమూరి సినిమా దర్శకుడిగా మారారు. అంతేకాదు విలేజ్ లో వినాయకుడు, బన్నీ అండ్ చెర్రీ వంటి సినిమాలతో యండమూరి నటుడిగా కూడా మారారు. యండమూరికి 1982 లో రఘుపతి రాఘవ రాజారాం నాటకానికి సాహిత్య అకాడెమీ అవార్డు, 1996 లో వెన్నెల్లో ఆడపిల్ల అనే ధారావాహికకు ఉత్తమ దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది పురస్కారం లభించాయి.
Also Read : Srirangam Srinivasarao : శ్రీ శ్రీ రచయిత