Ganta Srinivasarao: స్టీల్ ప్లాంట్ కార్మికులతో గంటా

టీడీపీ మేనిఫెస్టోలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం- ఎమ్మెల్యే గంటా

టీడీపీ మేనిఫెస్టోలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం- ఎమ్మెల్యే గంటా

 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా… విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గతంలో చేసిన రాజీనామాను ఆమోదించడం ద్వారా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ వేసిన ఎత్తుగడలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. స్టీల్ ప్లాంట్ కోసం గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసిన రెండేళ్ళ తరువాత… సరిగ్గా రాజ్యసభ ఎన్నికలకు ముందు ఆమోదించడంపై టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. అంతేకాదు మరోవైపు న్యాయపోరాటానికి కూడా సిద్ధమౌతోంది. అయితే ఈ విషయాన్ని తనకు, పార్టీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. దీనిలో భాగంగా శుక్రవారం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌ ఆమోదించిన తర్వాత తొలిసారిగా నాయకులతో గంటా భేటీ అయ్యారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేయబోయే పోరాటంకు సంబంధించిన భవిష్యత్‌ కార్యాచరణపై స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ సభ్యులతో చర్చించారు.

 

ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ… 57 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు, 32 మంది అమరవీరుల ప్రాణ త్యాగం, భూ నిర్వాసితుల త్యాగ ఫలితంగానే స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం జరిగిందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా రాష్ట్రంలో రాజీనామా చేసిన ఏకైక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అని తెలిపారు. చరిత్రలో త్యాగధనుల పేర్లు సజీవంగా నిలిచి ఉంటాయని అందులో గంటా శ్రీనివాసరావు పేరు కూడా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ…‘‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కేవలం పరిశ్రమగానే చూడకూడదు. ఆ సంస్థ విశాఖ ముఖచిత్రాన్నే మార్చేసింది. అలాంటి పరిశ్రమను వంద శాతం విక్రయించేందుకు కేంద్రం నిర్ణయించింది. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి పెడితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. తెదేపా, జనసేన మేనిఫెస్టోలో స్టీల్‌ప్లాంట్‌ అంశాన్ని పెడతాం’’ అని స్పష్టం చేసారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పల్లా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!