AP Budget 2024: రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన
రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన
AP Budget 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2024-25 (ఓటాన్ అకౌంట్ బడ్జెట్)ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టారు. రూ. 2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్ను ఆయన సభకు సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,30,110 కోట్లు, మూలధన వ్యయం రూ. 30,530 కోట్లుగా పేర్కొన్నారు. కాగా ద్రవ్యలోటు రూ. 55,817 కోట్లు ఉండగా రెవెన్యూ లోటు రూ. 24,758 కోట్లు ఉంది. ఇక జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56 శాతం, జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతంగా ఉంది. 2,05,352 కోట్లు రెవెన్యూ రాబడిని బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర పన్నుల ద్వారా రూ.49,286 కోట్లు, రాష్ట్ర పన్నుల ద్వారా రూ.1,09,538 కోట్లు వస్తుందని పేర్కొంది. పన్నేతర ఆదాయంగా రూ.14,400 కోట్లు, గ్రాంట్ ఇన్ఎయిడ్ ద్వారా రూ.32,127 కోట్లు వస్తుందని పేర్కొంది.
AP Budget 2024 Updates
మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్(Buggana Rajendranath).. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఆయన సభకు వివరించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి పాత, మూస పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంబించామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి బుగ్గన తెలిపారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టామన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించినా ఏప్రిల్ నుంచి జులై నెలల వరకే ఆమోదం తీసుకుంటారు. పూర్తిస్థాయి బడ్జెట్ను ఎన్నికల తర్వాత కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
Also Read : AP DSC 2024: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స !