Bengaluru Cafe Blast: బెంగళూరు కేఫ్ పేలుడు నిందితులపై రూ. 20లక్షల రివార్డు !
బెంగళూరు కేఫ్ పేలుడు నిందితులపై రూ. 20లక్షల రివార్డు !
Bengaluru Cafe Blast: బెంగళూరులోని రామేశ్వరం(Rameswaram) కెఫేలో మార్చి 1న జరిగిన బాంబు పేలుడు ఘటనలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తును వేగవంతం చేసింది. బాంబు పేలుడులో కీలక పాత్ర పోషించిన నిందితుడ్ని పట్టుకునేందుకు విచారణను ముమ్మరం చేసింది. సీసీటీవి ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ… నిందితుల వివరాలను రాబట్టింది. దీనిలో భాగంగా నిందితుల సమాచారం ఇచ్చిన వారికి భారీ రివార్డు ప్రకటించింది. ఇద్దరు నిందితులు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు భావిస్తున్న ఎన్ఐఏ… ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈమేరకు రివార్డు వివరాలను ఎన్ఐఏ తన అధికారిక సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు చేసింది.
Bengaluru Cafe Blast Reward
ఈ ఘటనకు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మథీన్ అహ్మద్‌లను కారకులుగా ఎన్ఐఏ అనుమానిస్తోంది. కేఫ్‌లో బాంబు అమర్చింది షాజీబ్‌గా భావిస్తోంది. ఈ నిందితులిద్దరూ 2020 ఉగ్రదాడి కేసులోనూ వాంటెడ్ జాబితాలో ఉన్నారు. వీరి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే info.blr.nia@gov.inకు మెయిల్ చేయాలని ఎన్ఐఏ కోరింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది.
కేసు విచారణలో ఇప్పటికే పురోగతి సాధించిన ఎన్ఐఏ… కీలక కుట్రదారుగా అనుమానిస్తోన్న ముజమ్మిల్ షరీఫ్ ను గురువారం అరెస్టు చేసింది. మూడు రాష్ట్రాల్లో విస్తృత గాలింపు అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ సోదాల్లో భాగంగా పలు డిజిటల్ పరికరాలను, నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. నిందితులకు షరీఫ్ పేలుడు పదార్థాలు, పరికరాలు సరఫరా చేసినట్లు ఎన్ఐఏ చెబుతోంది.
Also Read : KTR : కడియం శ్రీహరి లాంటి నాయకులు పార్టీ మారడంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు