MP Khagen Murmu: ఎన్నికల ప్రచారంలో యువతికి ముద్దు పెట్టిన ఎంపీ !

ఎన్నికల ప్రచారంలో యువతికి ముద్దు పెట్టిన ఎంపీ !

MP Khagen Murmu: లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వివిధ రకాలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీ కాయడం, దోశలు వేయడం, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి పనులతో సహా పలు పనులు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ లో ఓ బీజేపీ ఎంపీ కూడా ఇటీవల ఓట్ల కోసం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆ సమయంలో ఓ యువతి బుగ్గపై ఆయన ముద్దు పెట్టారు. అయితే ఎంపీ… ఆ యువతికి ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీసింది.

MP Khagen Murmu Viral

పశ్చిమ బెంగాల్‌ లోని ఉత్తర మాల్దా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ ఖగేన్‌ ముర్మూ పోటీ చేస్తున్నారు. గత సోమవారం తన నియోజక పరిధిలోని శ్రిహిపుర్‌ గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఆయన ఓ యువతి చెంపపై ముద్దు పెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీనితో ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. దీనిపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ… బీజేపీను తీవ్రంగా దుయ్యబట్టింది. ‘‘భాజపా ఎంపీ, ఉత్తర మాల్దా అభ్యర్థి ఖగేన్‌ ముర్ము ప్రచారం సందర్భంగా ఓ యువతికి ముద్దు పెట్టారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీలు… బెంగాలీ మహిళలపై అసభ్యకర పాటలు రాసే నేతలు… ఇలా బీజేపీ క్యాంప్‌లో మహిళా వ్యతిరేక నాయకులకు కొదవలేదు. నారీమణులకు ‘మోదీ పరివార్‌’ ఇస్తున్న గౌరవం ఇది. ఒకవేళ వారు అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండి,’’ అని టీఎంసీ విమర్శలు గుప్పించింది.

 

దీనితో ముద్దు వివాదంపై ఎంపీ ఖగేన్‌(MP Khagen Murmu) స్పందిస్తూ ఘటనపై స్పష్టతనిచ్చారు. ‘‘ఆమెను నా కుమార్తెలా భావించా. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటి ? కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారు. ఇలాంటి చిత్రాలను వక్రీకరించి వ్యక్తులు, పార్టీల పరువుకు భంగం కలిగిస్తున్నారు. అటువంటి వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం’’ అని బీజేపీ నేత వెల్లడించారు. మరోవైపు, యువతి కూడా దీనిపై స్పందిస్తూ ఎంపీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘సొంత కుమార్తెలా భావించి ఆయన ముద్దు పెట్టుకుంటే అందులో సమస్య ఏంటి ? ఇలాంటి ఘటనలను సోషల్ మీడియాలో వైరల్‌ చేసే వారిది చెత్త మనస్తత్వం. ఆ ఫొటో తీసిన సమయంలో మా అమ్మానాన్నా కూడా అక్కడే ఉన్నారు’’ అని ఆమె అన్నారు.

Also Read : Arvind Kejriwal: అరెస్టును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

Leave A Reply

Your Email Id will not be published!