Mudragada Kranthi :పవన్ కళ్యాణ్ ను కలిసిన ముద్రగడ కుమార్తె క్రాంతి, అల్లుడు చందు !
పవన్ కళ్యాణ్ ను కలిసిన ముద్రగడ కుమార్తె క్రాంతి, అల్లుడు చందు !
Mudragada Kranthi :కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి, అల్లుడు చందు…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసారు. తుని వేదికగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ను వారు మర్యాదపూర్వకంగా కలిసి… పార్టీలోనికి చేరడానికి సముఖత వ్యక్తం చేసారు. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్… వారి అభ్యర్ధనను సున్నితంగా తిరస్కరించారు. ఇదే విషయాన్ని తుని బహిరంగ సభ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.
Mudragada Kranthi :
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… తాను కులాలను, కుటుంబాలను విడదీసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. పార్టీలనే కలిపినవాడిని… కుటుంబాలను విడదీస్తానా అని ప్రశ్నించారు. ‘నేను కుటుంబాలను కలిపేవాడిని. కాపు ఉద్యమం పేరుతో ఎందరో యువతను కొందరు రెచ్చగొట్టారు. కానీ నేను ఏనాడూ అలా చేయలేదు. ఏ ఉద్యమం చేసినా సాధ్యమయ్యేదే చేయాలి. ఎమ్మార్పీఎస్ ఉద్యమం మూడు దశాబ్దాలుగా ఉంది. చివరకు ప్రధాని వద్దకు ఏబీసీడీ వర్గీకరణ అంశాన్ని తీసుకెళ్లగలిగారు. ఎవరు మొదలుపెట్టారో గానీ కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించకూడదు. నేనెప్పుడూ బాధ్యతగానే వ్యవహరించాను. అలాంటిది వైసీపీ నేత ముద్రగడ కుటుంబాన్ని వేరు చేస్తానా? నన్ను ఎందరో తిట్టారు. కానీ వారిని ఎదురు తిట్టలేదు. పెద్దలు తిట్టినా భరిస్తాను.
నాకు ఇప్పటివరకు ముద్రగడ తనయ క్రాంతి తెలియదు. జనసేనలో చేరతానంటే… తండ్రీకూతుళ్లను వేరు చేసే వ్యక్తిని కాదు. తండ్రి బాధ అర్థం చేసుకునేవాడిని. కూతురి బాధ్యతను కూడా గౌరవిస్తాను. కానీ ఇప్పుడు కండువా వేస్తే ఎన్నికల కోసం వాడుకున్నారని అంటారు. తండ్రి కూతురిని ఓ మాట అంటారు. పెద్దలు ఎన్ని అన్నా అర్థం చేసుకోవాలి. భరించాలి. అందుకే నన్ను మీ ఇంటికి తీసుకెళ్లండి.. అప్పుడు ముద్రగడకు చెప్పి మరీ అందరు కుటుంబ సభ్యులతో సగర్వంగా జనసేనలోకి సంపూర్ణంగా ఆహ్వానిస్తా’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్(Mudragada Kranthi) ను తిట్టడానికి ఓ అస్త్రంగా వాడుకుంటుందని… అతని కుమార్తె క్రాంతి రెండు రోజుల క్రితం ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రజా సేవ కోసం నీతి, నిజాయితీ, నిబద్దతతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడ్ని తన తండ్రి పదే పదే తిట్టడం… పిఠాపురంలో పవన్ గెలిస్తే తాను పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని అన్న వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో తన కుమార్తె క్రాంతి వ్యాఖ్యలపై… ముద్రగడ పద్మనాభం కూడా స్పందించారు. తన కుమార్తె పెళ్లైయి అత్తవారి ఇంటికి వెళ్ళిపోయిందని… తన ప్రాపర్టీ కాదంటూ… ఆమె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అంటూ తోసిపుచ్చారు.
Also Read:-K V Rajendranath Reddy: ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు !